అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విఫలమవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సిఫారసు చేయడం.. దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపడం చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. 20 రోజులు పాటు అనేక మలుపులు తీరిగిన మరాఠా రాజకీయానికి తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ మరింత సమయం కోరడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. రాష్ట్రపతి అసెంబ్లీని ఆరు నెలల పాటు సుప్తచేతనావస్థలో ఉంచారు. రాజ్యాంగబద్ధంగా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని గవర్నర్ నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగిసేలోపే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేయడం, కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపడంపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీకీ తగిన సమయం ఇవ్వలేదంటూ శివసేన సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
