మహానటికి జాతీయ కీర్తి

అక్షిత ప్రతినిధి, దిల్లీ  :  జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ప్రతిభ మరోసారి ద్విగుణీకృతమైంది. దిల్లీలో ప్రకటించిన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఏకంగా ఏడు జాతీయ పురస్కారాలతో తళుకులీనింది. ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘చి.ల.సౌ’, ‘అ!’ చిత్రాలు జాతీయ అవార్డుల్ని గెలుచుకున్నాయి. ‘రంగస్థలం’ మినహాయిస్తే మిగిలినవన్నీ చిన్న చిత్రాలే. ‘అ’ అయితే ఓ ప్రయోగం. ఇవన్నీ బాక్సాఫీసు పరంగానూ మంచి విజయాల్నే అందుకున్నాయి. అలనాటి మేటి నటీమణి సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన ‘మహానటి’ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ మెప్పించింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ నటిగా కీర్తి సురేష్‌ (మహానటి) జ్యూరీని మెప్పించింది. 28 ఏళ్ల తరవాత తెలుగు సినిమాలో నటించిన ఓ కథానాయికకు ఈ పురస్కారం దక్కడం విశేషం. ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’ పీఠం ‘మహానటి’కే దక్కింది. ఇదే చిత్రానికి ‘ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌’ విభాగంలో ఇంద్రాక్షి పట్నాయక్‌, గౌరంగ్‌ షా, అర్చనారావులకు పురస్కారాలు దక్కాయి.

తెలుగు దర్శకుడి మరాఠీ చిత్రం
ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయితగా రాహుల్‌ రవీంద్రన్‌ (చి.ల.సౌ.) అవార్డు అందుకోబోతున్నారు. ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగంలో ‘రంగస్థలం’ చిత్రానికి గానూ రాజా కృష్ణన్‌ ఎంపికయ్యారు. మేకప్‌ విభాగంలో ‘అ!’ చిత్రానికి గాను రంజిత్‌కు అవార్డు ప్రకటించారు. ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ‘కేజీఎఫ్‌’ చిత్రంతో కలిసి ‘అ!’ చిత్రం అవార్డు పంచుకోనుంది. తెలుగువాడైన సుధాకర్‌రెడ్డి యక్కంటికి ఆయన తెరకెక్కించిన మరాఠీ చిత్రం ‘నాల్‌’కు ‘ఇందిరాగాంధీ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు’ పురస్కారం దక్కింది.

ఉత్తమ చిత్రంగా గుజరాతీ సినిమా
గుజరాతీ సినిమా ‘హెల్లారో’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ‘అంధాధున్‌’లో అంధుడిగా అద్భుత నటన ప్రదర్శించిన ఆయుష్మాన్‌ ఖురానా, ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’లో మేజర్‌ విహాన్‌ సింగ్‌గా మెప్పించిన విక్కీకౌశల్‌.. ఉత్తమ నటులుగా జాతీయ అవార్డును పంచుకున్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశంలో జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌ రాహుల్‌ రావైల్‌ ఈ వివరాలు వెల్లడించారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన ‘మోస్ట్‌ ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌’ అవార్డుకు ఉత్తరాఖండ్‌ ఎంపికైంది. ఉత్తమ చిత్రానికి స్వర్ణకమలం, రూ.2.5 లక్షల నగదు బహుమతి అందిస్తారు. ఉత్తమ నటీనటులకు రజత కమలం, రూ.50,000 నగదు ప్రదానం చేస్తారు.

tags : cine, national awards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *