మల్లన్న చెంత… గోదారి సాగరం

 50 టీఎంసీల సామర్థ్యంతో

భారీ జలాశయం

★ వడివడిగా సిద్ధమవుతున్న
వరప్రదాయిని

★ 75 శాతం పూర్తయిన మల్లన్నసాగర్‌

★ రాత్రీపగలు తేడా లేకుండా పనులు

★ జూన్‌లో మూడో వంతు నీటి భర్తీ

★ మెదక్‌, నల్లగొండ, ఇందూరుకు వరం

★ గజ్వేల్‌లో ఆధునిక నిర్వాసిత కాలనీ

★ ఉగాదికి గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్దదైన మల్లన్నసాగర్‌ జలాశయం నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. దాంతో త్వరలోనే ఇక్కడికి గోదావరి పరవళ్లు తొక్కనున్నది. నిర్దేశిత సమయంలో పనులు పూర్తిచేసేందుకు అధికారులు, కార్మికులు రాత్రీపగలు శ్రమిస్తున్నారు. మరో రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తిచేసి రిజర్వాయర్‌లోకి గోదావరి నీటిని తరలించాలని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌కు తాగునీటితోపాటు లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఈ రిజర్వాయర్‌ను డిజైన్‌ చేశారు.ఉత్తర తెలంగాణ వరప్రదాయిని వడివడిగా పూర్తవుతున్నది. ఉమ్మడి మెదక్‌, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల రాతమార్చే గోదారి జలధారలు త్వరలోనే పుడమిని పునీతం చేయనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మిస్తున్న కొమురవెల్లి మల్లన్న సాగర్‌పనులు 75 శాతానికి పైగా పూర్తయ్యాయి. జూన్‌లో జలాశయంలోకి గోదావరి జలాలను వదిలాలన్న లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి. పనుల పరోగతిపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు.

ఒక రిజర్వాయర్‌.. అనేక ప్రయోజనాలు
—————————————
కాళేశ్వరం ఎత్తపోతల ప్రాజెక్టులో మల్లన్నసాగర్‌ జలాశయమే అతిపెద్దది. అత్యంత కీలకమైంది కూడా. సిద్దిపేట జిల్లాలోని తొగుట-కొండపాక మండలాల శివారులో గుట్టల మధ్యన దీని నిర్మాణం చేపట్టారు. వ్యవసాయ అవసరాలతోపాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 12 నుంచి 19 ప్యాకేజీల ద్వారా సుమారు 8.33 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు దీని నుంచి నీటిని అందిస్తారు. మరో 7,37,250 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ-స్టేజ్‌ 1, నిజాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టుల కింద కొత్త, పాత ఆయకట్టు కలుపుకొని 15,71,050 ఎకరాలు ఈ రిజర్వాయర్‌ కిందికి రానున్నాయి.

దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీ
—————————————
మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీని రాష్ట్రప్రభుత్వం అందించింది. 2019 మేలోనే గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి పరిహారం ఇచ్చారు. భూములతోపాటు, ఇండ్లు, పశువుల కొట్టాలు, బావులు, బోరుబావులన్నింటికీ విలువగట్టి అధికారులు పరిహారం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.5.04 లక్షల విలువైన డబుల్‌ బెడ్‌రూం ఇంటిని ప్రభుత్వం నిర్మించి ఇస్తున్నది. ఇల్లు వద్దనుకునేవారికి 250 గజాల ఇంటిస్థలం, రూ.5.04 లక్షల చెక్కును అందించింది. పునరావాసం కింద ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షల ప్యాకేజీ అదనంగా అందించారు. 18 ఏండ్లు దాటిన యువతీ యువకులకు రూ.5 లక్షల పునరావాస సాయం, 250 గజాల ఇంటి స్థలం ప్రభుత్వం ఇచ్చింది.

అగ్గి కురుస్తున్నా ఆగని పనులు
—————————————
మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. అక్కడక్కడా మిగిలిపోయిన పనులతో పాటు ఓటీ స్లూయిస్‌, గ్రామాలకు వెళ్లే రహదారుల మధ్య బండ్‌ గ్యాప్‌ పనులు, రివిట్‌మెంట్‌ తదితర పనులు ప్రస్తుతం పూర్తిచేస్తున్నారు. మండుటెండలో కూడా అధికారులు, వర్క్‌ ఏజెన్సీలు, కార్మికులు నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తిచేసేందుకు శ్రమిస్తున్నారు. కట్ట నిర్మాణంలో కిందిస్థాయిలోని హర్టింగ్‌ జోన్‌లో నల్లమట్టి, రెండువైపులా ఎర్రమట్టితో నింపారు. సీవోటీ పనుల్లో ( బండ్‌ నిర్మాణంలో) 13.60 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనుల్లో 12.25 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తిచేశారు. 25 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ (తెట్టె) పనుల్లో 24 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తైంది.

ముంపు బాధితులకు అత్యాధునిక కాలనీ
—————————————
మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కోసం 17,871 ఎకరాల భూమి సేకరించారు. దీనికింద 8 గ్రామాలు పూర్తిగా, 3 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి. తొగుట మండలంలోని వేములఘాట్‌, పల్లెపహాడ్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌, లక్ష్మాపూర్‌, రాంపూర్‌, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలంలోని సింగారం, ఎర్రవెల్లి గ్రామాలు పూర్తిగా మునుగుతున్నాయి. తొగుట మండలంలోని తుక్కాపూర్‌, కొండపాక మండలంలోని తిప్పారం, మంగోల్‌ గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల్లోని ముంపు బాధితులకు గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్‌ హబ్‌ పక్కన ముట్రాజ్‌పల్లి వద్ద అత్యాధునిక వసతులతో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మిస్తున్నారు. 600 ఎకరాల విస్తీర్ణంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. ఒక్కో ప్లాట్‌ 250 గజాల విస్తీర్ణంలో ఉన్నది. మూడు వేల ఇండ్లకుగాను 2,500 ఇండ్ల నిర్మాణం పూర్తిచేశారు. మిగిలినవి చివరిదశలో ఉన్నాయి. 18 మీటర్ల వెడల్పుతో ప్రధాన రోడ్లు, 12.9 మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్లు వేస్తున్నారు. సుమారు 300 కుటుంబాలు ఇప్పటికే గృహప్రవేశాలు చేశాయి. ఉగాదినాటికి అన్ని కుటుంబాలతో గృహ ప్రవేశాలు చేయించనున్నారు. మరో రెండువేల ఇండ్లకోసం స్థలాన్ని చదునుచేస్తున్నారు.

జూన్‌లో నీరు విడుదల చేస్తాం
—————————————
మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు 85 శాతానికిపైగా పూర్తిచేశాం. మరో రెండునెలల్లో మిగిలిన పని పూర్తిచేసి జూన్‌లో రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను విడుదల చేస్తాం. దశలవారీగా నీటి విడుదల ఉంటుంది.
-హరిరాం, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ

ఇవీ మల్లన్నసాగర్‌ ప్రత్యేకతలు
—————————————
• జలాశయం పూర్తి సామర్థ్యం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) + 557 మీటర్లు.
• 532 మీటర్ల వరకు (10 టీఎంసీలు) నీటిని నిల్వ చేస్తారు. ఇది డెడ్‌ స్టోరేజీ.
• 532 మీటర్ల నుంచి 557 మీటర్ల వరకు నీటిని నిరంతరం వాడుకుంటారు. ఇవి 40 టీఎంసీలు.
• రిజర్వాయర్‌ కోసం 17,871 ఎకరాల భూమిని సేకరించారు.
• రిజర్వాయర్‌ కట్ట పొడవు 22.6 కిలోమీటర్లు.
• ఆనకట్టకు 5 ఓటీ స్లూయిస్‌లు ఉంటాయి.
• కట్ట 2.525 కిలోమీటర్‌ వద్ద 8 గేట్లతో ఉండే మొదటి స్లూయిస్‌ ద్వారా కొండపోచమ్మ, బస్వాపూర్‌, గంధమల్ల రిజర్వాయర్లకు (13,14,15,16 ప్యాకేజీలకు) నీటిని తరలిస్తారు. ఈ స్లూయిస్‌ నుంచి రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించవచ్చు. దీనికింద 5,76,800 ఎకరాల ఆయకట్టు ఉన్నది.
• రెండో స్లూయిస్‌ను 2.891 కిలోమీటర్‌ 4 గేట్లతో వద్ద ఏర్పాటు చేస్తున్నారు. దీనినుంచి సింగూరు ప్రాజెక్టుకు (18,19 ప్యాకేజీలకు) రోజుకు అర టీఎంసీ నీటిని పంపిస్తారు. దీనికింద 1,32,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానున్నది.
• మూడో ఓటీ స్లూయిస్‌ 21.35 కిలోమీటర్‌ ఒకే గేటుతో వద్ద ఉంటుంది. దీని నుంచి రోజుకు 1,200 కూసెక్కుల నీటిని 12వ ప్యాకేజీలోని ప్రాంతాలకు అందిస్తారు. దీని (దుబ్బాక కెనాల్‌ ) కింద 1,25,000 ఎకరాల ఆయకట్టు తడువనున్నది.
• 1.10 కిలోమీటర్‌ వద్ద సర్‌ప్లస్‌ వీయర్‌ ఏర్పాటుచేస్తున్నారు.
• 4.8 కిలోమీటర్‌ వద్ద ఉండే నాలుగో స్లూయిస్‌ ద్వారా రోజుకు రెండువేల క్యూసెక్కుల నీటిని మిషన్‌ భగీరథకు తరలిస్తారు.
• 0.75 కిలోమీటర్‌ వద్ద తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే ఐదో స్లూయిస్‌ను ఏర్పాటుచేస్తున్నారు. దీనినుంచి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని తరలించవచ్చు.
• రిజర్వాయర్‌ కట్ట అడుగు భాగంలో 350 మీటర్ల వెడల్పుతో ప్రారంభమై పైభాగానికి వచ్చేసరికి 8 మీటర్ల వెడల్పు ఉంటుంది. కట్ట అత్యధిక ఎత్తు 59.96 మీటర్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *