మరణంలోనూ వీడని బంధం

ఆ అక్కా చెల్లెళ్లకు ఏ కష్టం వచ్చిందో తెలియదు.. ఇద్దరు కలిసి తనువు చాలించారు. పీలేరు సీఐ సోమశేఖర్‌రెడ్డి కథనం మేరకు.. కలికిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో పట్నం అలీమాబి తన ఇద్దరు కుమార్తెలు పట్నం తస్లీం(19), పట్నం షికాబి(18), కుమారుడు మహమ్మద్‌ రఫీతో కలిసి ఉంటోంది. ఆమె భర్త నాలుగేళ్లపాటు కువైట్‌లో ఉండి వచ్చి.. సెప్టెంబరు మొదటి వారంలో తిరిగి వెళ్లాడు. ఈ నేపథ్యంలో మదనపల్లి పట్టణంలోని హార్సిలీ హిల్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ కళాశాలలో పెద్ద కుమార్తె తస్లీం నర్సింగ్‌ మూడవ సంవత్సరం, చిన్న కుమార్తె షికాబి నర్సింగ్‌ రెండో సంవత్సరం చదుతూ అక్కడే బీసీ వసతిగృహంలో ఉంటున్నారు. వారాంతంలో ఇంటికి వచ్చి వెళ్లే వారు. కుమారుడు మహమ్మద్‌ రఫీ మండల పరిధిలోని మహల్‌లో ఉర్దూ ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది చదువుతున్నాడు. కాగా నవంబరు 1 నుంచి నర్సింగ్‌ పబ్లిక్‌ పరీక్షలు ఉండటంతో కళాశాలలో ప్రిపరేషన్‌ సెలవులు ఇచ్చారు.

దీంతో అక్కాచెల్లెళ్లు 10 రోజుల నుంచి ఇంటి వద్దనే ఉండి చదువుకుంటున్నారు. తల్లి అలీమాబి కంటి శస్త్రచికిత్స నిమిత్తం వారం క్రితం చిన్న కుమార్తెతో కలిసి వెళ్లి మదనపల్లిలోని ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకు వచ్చారు. తిరిగి సోమవారం ఆసుపత్రికి వెళ్లాల్సి రావడంతో ఉదయం ఒకరు తన వెంట ఆసుపత్రికి రావాలని తల్లి కోరినా.. వారు ఇంటి వద్దనే ఉండి చదువుకోవాలని చెప్పారు. దీంతో ఆమె ఒక్కతే ఆసుపత్రికి వెళ్లింది. మధ్యాహ్నం వచ్చి ఇంట్లో చూసే సరికి.. కుమార్తెలు ఇద్దరు ఇంటి పై కప్పునకు ఉన్న కమ్మికి వేర్వేరు చీర్లతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపిం చారు. ఇరుగుపొరుగు సహాయంతో మృతదేహాలను కింద కు దించి పోలీసులకు సమాచారం అందించింది. పీలేరు సీఐ సోమశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ పురుషోత్తంరెడ్డి మృతదేహాలను కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లి అలీమా బి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారణం ఏమిటో..?
నర్సింగ్‌ చదువుతున్న అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశామని సీఐ తెలిపారు. ప్రేమ విషయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారా..? కుటుంబ కలహాలతోనా..? అన్న విషయాలపై విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికంగా తీవ్ర కలకలం పేరింది. దర్యాప్తులో అసలు విషయం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *