అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: నిరంతరం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసే టీఆర్ఎస్ పార్టీకే ఓటెయ్యాలని హైదరాబాద్ ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. మత రాజకీయాలు చేసే పార్టీలను తిప్పికొట్టాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. నగరంలోని బోరబండ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫసియుద్దిన్కు మద్దతుగా కవిత ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసే టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలన్నారు. కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గినా పేదవాళ్లకు నెలకు రూ.1500, ఉచిత రేషన్ అందించామమన్నారు. హైదరాబాద్లో వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి రూ. 10 వేల తక్షణ సాయాన్ని అందించామన్నారు. ఇంకా ఎవరైనా మిగిలిఉంటే, రాని వాళ్లకు డిసెంబర్ 7 నుండి సాయం అందిస్తామన్నారు. రాష్ట్రానికి గానీ, హైదరాబాద్కు గానీ ఒక్క పైసా సాయం చేయని బీజేపీ ఓట్ల కోసం మతరాజకీయాలు చేస్తుందన్నారు. సొంత ప్రజలపైనే సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. హైదరాబాద్ మెట్రో రైలులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్న బీజేపీ హామీపై కవిత స్పందిస్తూ.. బీజేపీ అధికారంలో ఉన్న బెంగుళూరులో ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మెట్రోలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించినప్పుడు ఇదే బీజేపీ నాయకులు విమర్శించారన్న విషయాన్ని మరచిపోవద్దన్నారు. దశాబ్దాల నుండి బోరబండలో ప్రజలకు ఇబ్బందిగా మారిన భూముల రిజిస్ట్రేషన్ సమస్యను టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కారించామన్నారు. బోరబండలో గత ఆరేండ్లలో రోడ్లు, వీధి లైట్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించి, డివిజన్ అభివృద్ధికి బాబా ఫసియుద్దీన్ ఎంతో కృషి చేశారన్నారు. డిసెంబర్ 1 న జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసెందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బోరబండ టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నాయకులు శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
