మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం : హరీశ్‌రావు

అక్షిత ప్రతినిధి, సిద్దిపేట : దసరా నాటికి జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలను కాళేశ్వరం జలాలతో నిండు కుండల్లా  నింపి ఉంచుతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కోమటిచెరువులో లక్ష 20 వేల చేప పిల్లలను ఆదివారం ఆయన వదిలి మాట్లాడారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తున్న ఘనత టిఆర్‌ఎస్‌దేనన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గంలోని ఒకటి రెండు చెరువుల్లో మాత్రమే సబ్సిడీ చేప పిల్లలను వదిలేవారని గుర్తు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 138 చెరువుల్లో రూ. 56.40 లక్షలతో చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న వందశాతం సబ్సిడీతో మత్స్యకారుల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అనుకున్న స్థాయిలో వర్షాలు కురువక చెరువులో నీరు చేరలేదన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు మిడ్‌మానేరుకు చేరుకున్నాయని నెల రోజుల్లోపే అనంతగిరి, రంగనాయకసాగర్ ప్రాజెక్టులకు ఈ జలాలు రానున్నాయన్నారు. కాలువలు ద్వారా అన్ని చెరువులను నీటితో నింపుతామన్నారు. దీంతో మత్స్యకారులకు చేతినిండా పని లభిస్తుందన్నారు. అలాగే మత్స్యకారులు దళారులను నమ్మి మోసపోవద్దని నేరుగా వ్యాపారం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి మార్కెటింగ్ సదుపాయం సైతం కల్పించామన్నారు. మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయని వర్షం కోసం ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. సిద్దిపేట పట్టణంలో చేపలు విక్రయించడానికి ఆధునాతన మార్కెట్ ఉందన్నారు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు సైతం అందిస్తున్నామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో సైతం       లక్ష 80 వేల చేప పిల్లలను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు చెరువుల్లో వదిలినట్లు తెలిపారు. అనంతరం మత్స్యశాఖ అధికారులు, మత్స్యశాఖ సంఘం ప్రతినిధులు చింతచెరువులో 54 వేల చేప పిల్లలను వదిలారు.     ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్మన్ వేలేటి రోజాశర్మ, మునిసిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మినారాయణ, మత్స్యశాఖ జిల్లా అధికారి వెంకటయ్య, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్, తాళ్లపల్లి సత్యనారాయణగౌడ్, నాగరాజు, వేలేటి రాధాకృష్ణశర్మ, మత్స్యకారుల సంఘం ప్రతినిధులు గౌటి అశోక్, మల్లేశం, నర్సింలు, పెంటయ్య,  శ్రీనివాస్  తదితరులు  ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *