మందుల కుంభకోణంలో అరెస్టులు మొదలు

-ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, జేడీ పద్మ సహా ఏడుగురు అరెస్టు

-అందరికీ14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు

-చంచల్‌గూడ జైలుకు తరలింపు

-ఆధారాల కోసం కొనసాగుతున్న సోదాలు

-తనిఖీల్లో లభ్యమైన పత్రాలను విశ్లేషిస్తున్న ఏసీబీ

-లింకుల ఆధారంగా మరింత లోతుల్లోకి..

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్:  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోళ్ల కుంభకోణంలో అరెస్టులపర్వం మొదలైంది. గురు, శుక్రవారాల్లో రికార్డుస్థాయిలో 23 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలుచేసిన ఏసీబీ అధికారులు.. పలు కీలకపత్రాలను, ఇతర ఆధారాలను సేకరించారు. వాటి ఆధారంగా కేసులో కీలక సూత్రధారులుగా భావిస్తున్న ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ దేవికారాణి, ఐఎంఎస్ వరంగల్ జేడీ డాక్టర్ కే పద్మను శుక్రవారం అరెస్టు చేసినట్టు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఓ ప్రకటనలో తెలిపారు.

వీరితోపాటు ఐఎంఎస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ (స్టోర్స్) డాక్టర్ కే వసంత ఇందిర, శంషాబాద్ ఈఎస్‌ఐ డిస్పెన్సరీ గ్రేడ్-2 ఫార్మసిస్టు ఎం రాధిక, ఐఎంఎస్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వీ హర్షవర్ధన్, ఓమ్ని మెడి రిప్రజెంటేటివ్ సీహెచ్ శివనాగరాజు, ఓమ్ని మెడి ఎండీ కే శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీలను అరెస్టుచేసినట్టు పేర్కొన్నారు. వీరినీ సిటీ సివిల్‌కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. వైద్యపరీక్షలు జరిపి వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. నకిలీ ఇం డెంట్లు, అనుమతి లేని ఏజెన్సీలతో మందుల కొనుగోళ్లు సహా వివిధ రకాలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో వీరందరిపైనా 13(1)(సీ)(డీ), 7(ఏ), 13(1)(ఏ), 13(2), 477(ఏ), 465, 468, 471, 420 రెడ్‌విత్120-బీ, 34ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.

కీలక ఆధారాలకోసం తనిఖీలు ముమ్మరం

ఈ స్కాంపై ఏసీబీకి జూలైలోనే ఫిర్యాదు అందగా పక్కాగా ఆధారాలు సేకరించి బుధవారం పలువురిపై కేసు నమోదుచేశారు. గురువారం ఏకకాలంలో ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, జేడీ కే పద్మ, ఏడీ వసంతఇందిరతోపాటు 17 మంది సిబ్బంది ఇండ్లు, కార్యాలయాలు, మరో నలుగురు ప్రైవేటు వ్యక్తుల ఇండ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నకిలీ బిల్లులు సహా పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన అధికారులు, వ్యక్తుల మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు వాటిని ఫోరెన్సిక్ నిపుణులకు పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *