భూ డిజిటల్ సర్వేకు సర్కార్ సన్నద్ధం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి ;

రాష్ట్రంలో భూముల డిజిటల్‌ సర్వేకు సర్కారు సన్నద్ధమవుతున్నది. భూ వివాదాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా 95 శాతానికిపైగా భూముల రికార్డులను సరిచేశారు. వాటన్నింటినీ డిజిటలైజ్‌ చేశారు. ప్రజల చెంతకు భూ రికార్డులను చేర్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇక భూముల విస్తీర్ణంలో ఇంచుజాగా కూడా తేడాలేకుండా తాజాగా డిజిటల్‌సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కూడా కేటాయించారు. రాష్ట్రంలో డిజిటల్‌ సర్వే చేయడానికి ముందుకొచ్చిన 17 కంపెనీలతో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బీఆర్కే భవన్‌లో ప్రాథమికస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. భూముల డిజిటల్‌ సర్వేకు ఉపయోగించే పద్ధతులు, సర్వేకు పట్టే సమయం, వ్యయం, అందుబాటులో ఉన్న సర్వే పరికరాలు, సాంకేతిక నిపుణులు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ఇంటర్నెట్‌ తదితర అంశాలను చర్చించారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ త్వరలోనే సమావేశమవుతారని సీఎస్‌ తెలిపారు. సమావేశంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ సీఐజీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *