భారత్ లో స్పుత్నిక్ వీ ఉత్పత్తి

ప్రారంభించిన పానేసియా బయోటెక్‌
* ఏటా 10 కోట్ల డోసుల తయారీ 

న్యూఢిల్లీ, అక్షిత ప్రతినిధి :

దేశంలో కరోనా వైరస్‌ మృత్యు ఘంటికలు మోగిస్తున్న వేళ ఊరటనిచ్చే వార్త. రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్డీఐఎఫ్‌)తో కలిసి భారత్‌లో ‘స్పుత్నిక్‌ వి’ కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పానేసియా బయోటెక్‌ ప్రారంభించింది. మహమ్మారి అడ్డుకట్టకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమన్న అభిప్రాయాల మధ్య వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు ఇది దోహదం చేయనున్నది. ఏటా 10 కోట్ల డోసులను తయారు చేస్తామని పానేసియా బయోటెక్‌ చెప్తున్నది. కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డి వద్దగల సంస్థ ఉత్పాదక కేంద్రంలో స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. అయితే తొలి బ్యాచ్‌ వ్యాక్సిన్లను మొదట నాణ్యత పరీక్ష నిమిత్తం రష్యా గమలేయా సెంటర్‌కు పంపించనున్నామని ఆర్డీఐఎఫ్‌, పానేసియా బయోటెక్‌ తాజాగా విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. అంతర్జాతీయంగా ఈ వ్యాక్సిన్‌ను ఆర్డీఐఎఫ్‌ మార్కెటింగ్‌ చేస్తుండగా, భారత్‌లో ఏటా 10 కోట్ల డోసులను తయారుచేసేందుకు పానేసియా బయోటెక్‌ ముందుకువచ్చింది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి మొదలు కావడం.. కరోనాపై పోరులో భారత్‌కు ఎంతగానో కలిసొచ్చే అంశంగా ఆర్డీఐఎఫ్‌ సీఈవో కిరిల్‌ దిమిత్రీవ్‌ అభివర్ణించారు. త్వరలోనే పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ ఉత్పత్తి మొదలవుతుందన్న విశ్వాసాన్ని కనబరిచారు. భారత్‌లో అత్యవసర వినియోగం కింద గత నెల 12న స్పుత్నిక్‌ వి నమోదైన విషయం తెలిసిందే. ఈ నెల 14న డాక్టర్‌ రెడ్డీస్‌ స్పుత్నిక్‌ వి వ్యాక్సినేషన్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా మొదలు పెట్టిన సంగతీ విదితమే. దిగుమతి చేసుకున్న తొలి డోసును సంస్థ ఉద్యోగికే రెడ్డీస్‌ ఇచ్చింది. కాగా, కరోనా వైరస్‌పై ఈ వ్యాక్సిన్‌ ప్రభావం 97.6 శాతంగా ఉన్నట్లు ఆర్డీఐఎఫ్‌ చెప్తున్నది. పైగా దీన్ని సులభంగానే నిల్వ చేసుకోవచ్చని అంటున్నది. ఇప్పటిదాకా 66 దేశాల్లో స్పుత్నిక్‌ వి అనుమతి పొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *