భాగ్యనగరిలో… మెడ్ ట్రానిక్

హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్‌

★ అమెరికా తర్వాత అతి పెద్ద ఆఫీస్‌

★ వెయ్యిమందికి ఉపాధి అవకాశాలు

★ 1200 కోట్ల భారీ పెట్టుబడి

★ వైద్య పరికరాల రాజధాని.. నగరం

★ ప్రారంభించిన ఐటీ మంత్రి కేటీఆర్‌

★ లైఫ్‌ సైన్సెస్‌లో రాష్ట్రం ముందంజ:
ఫార్మాస్యూటికల్‌ కార్యదర్శి అపర్ణ

★ టెక్‌ సంస్థలకు కేరాఫ్‌ తెలంగాణ:
మెడ్‌ట్రానిక్‌ సీఈవో జెఫ్‌ మార్త

★ ప్రపంచ వ్యాక్సిన్‌ కేంద్రం హైదరాబాద్‌:
యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ రిఫ్‌మాన్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

హైదరాబాద్‌లో మరో బహుళజాతి కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మెడ్‌ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఎంఈఐసీ)ను బుధవారం నానక్‌రామ్‌గూడలో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. అమెరికాకు బయట మెడ్‌ట్రానిక్‌ సంస్థ ఏర్పాటుచేసిన అతి పెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఇదే కావటం విశేషం. హైదరాబాద్‌ సెంటర్‌లో 160 మిలియన్‌ డాలర్ల (రూ.1200 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. రానున్న ఐదేండ్లలో దాదాపు వెయ్యిమందికి ఈ సెంటర్‌లో ఉపాధి అవకాశాలు లభిస్తాయ ని పేర్కొన్నది. దాదాపు 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడ్‌ట్రానిక్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ దేశానికే మెడికల్‌ డివైజ్‌ హబ్‌గా హైదరాబాద్‌ మారబోతున్నదన్నారు. గూగు ల్‌, యాపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, సేల్స్‌ఫోర్‌, నోవార్టీస్‌, ఉబెర్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు అమెరికాకు బయట తమ రెండో అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేశాయని గుర్తుచేశారు. తాజాగా ఆ జాబితాలో మెడ్‌ట్రానిక్‌ కూడా చేరటంపై సం తోషం వెలిబుచ్చారు.

150 పేటెంట్లు.. 400 మేధో హక్కులు
——————————————————-
మెడ్‌ట్రానిక్‌ వద్ద ఇప్పటికే 150 వరకు పే టెంట్‌ హక్కులున్నాయని.. మరో 400 వరకు ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ ఇప్పటికే రారాజుగా ఉన్నదని తెలిపారు. మెడ్‌టెక్‌ రంగానికి కూడా హైదరాబాద్‌ హబ్‌గా మారుతుందని చెప్పారు. 2017లోనే సుల్తాన్‌పూర్‌లో మెడ్‌టెక్‌ పార్కును ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు. ఇక్కడ ఇప్పటికే 40 కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటుచేశాయని తెలిపారు. కేంద్రప్రభుత్వం ఈ రంగానికి ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని కోరారు. మెడ్‌ట్రానిక్‌ తన ఇన్నోవేషన్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయడం దేశానికే గర్వకారణమన్నారు. మేక్‌ఇన్‌ ఇండియాలో భాగంగా డిజైన్‌, డెవలప్‌మెంట్‌ను ఇంకా ప్రోత్సహించాలని కేంద్రానికి సూచించారు. మెడ్‌టెక్‌ రంగాన్ని ప్రోత్సహించడానికి ఇంక్యుబేషన్‌ సెంటర్‌, మెడిటెక్‌పార్క్‌, రెగ్యులేటరీ ఫెసిలిటీస్‌ ఏర్పాటుచేశామని తెలిపారు. కార్యక్రమం లో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, లైఫ్‌ సైన్సెస్‌ సీఈవో శక్తి నాగప్పన్‌ తదితరులు కూడా పాల్గొన్నారు.

మెడ్‌ట్రానిక్‌ ప్రస్థానం
——————————————————-
• 1949 వైద్య పరికరాల రిపేర్‌షాపుగా ప్రారంభం
• 1957 బ్యాటరీతో పనిచేసే పేస్‌మేకర్‌ ఆవిష్కరణ
• 1960 తొలి పేస్‌మేకర్‌ ఆవిష్కరణ
• 1977 ప్రాస్థెటిక్‌ హార్ట్‌ వాల్వ్‌ తయారీ
• 1979 మెడ్‌ట్రానిక్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు
• 1983 న్యూరో స్టిమ్యులేషన్‌ సిస్టంకు విస్తరణ
• 1999 స్పైనల్‌ కేర్‌ రంగానికి విస్తరణ
• 2001 డయాబెటిక్‌ రంగానికి విస్తరణ
• 2002 తొలి రిమోట్‌మానిటరింగ్‌ పరికరం ఆవిష్కరణ
• 2016 అతి చిన్న పేస్‌ మేకర్‌ ఏర్పాటు
• 2017 అతి చిన్న స్పైనల్‌ కార్డ్‌ స్టిమ్యులేటర్‌ ఆవిష్కరణ

దూసుకుపోతున్న తెలంగాణ
——————————————————-
మెడ్‌టెక్‌ రంగానికి కావాల్సిన మానవ వనరులు దేశంలో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం లైఫ్‌సైన్సెస్‌, మెడ్‌టెక్‌ రంగంలో చాలా ముందున్నది. మెడ్‌టెక్‌రంగం సన్‌రైజ్‌ రంగం. కరోనా మెడ్‌టెక్‌రంగ సంస్థలకు సంబంధించిన మౌలికసదుపాయాల ఏర్పాటుకు కేం ద్రం ప్రోత్సాహకాలు అందిస్తున్నది. నైపర్‌ లాం టి ప్రతిష్ఠాత్మక సంస్థ హైదరాబాద్‌లో ఉన్నది.
అపర్ణ, కేంద్ర ఫార్మాసూటికల్‌ కార్యదర్శి

ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండీ
——————————————–
తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీ పాలసీని అమలు చేస్తున్నది. ప్రపంచ వ్యాక్సిన్‌ త యారీ కేంద్రంగా హైదరాబాద్‌ ఉన్నది. దేశంలోనే అతిపెద్ద మెడ్‌టెక్‌ పార్క్‌ను ఏర్పాటు చేసింది.
జోయల్‌ రిఫ్‌మాన్‌, యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌

ప్రభుత్వ భాగస్వామ్యంతో మరిన్ని సేవలు
——————————————————-
మెడ్‌ట్రానిక్‌.. వైద్యరంగంలో ఎకో సిస్టం అభివృద్ధికి దోహదం చేస్తుంది. దేశంలోని అత్యున్నత ప్రతిభావంతులను ఈ రంగంలో ప్రోత్సహిస్తున్నాం. హైదరాబాద్‌ టెక్నాలజీ కంపెనీలకు కేంద్రంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచ ఆరోగ్యరంగానికి, ప్రజల ఆయుః ప్రమాణం పెరుగుదలకు ఎన్నో సేవలు అందించగలమనే విశ్వాసం ఉన్నది.
జెఫ్‌ మార్త, సీఈవో, చైర్మన్‌, మెడ్‌ట్రానిక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *