బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా 2024 వరకు!

అక్షిత ప్రతినిధి, ముంబయి: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ తన మార్క్‌ను మరోసారి చూపించాడు. పదవీ చేపట్టిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన డే/నైట్‌ టెస్టు సన్నాహకాలు చేపట్టిన అతడు తొలి సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్‌)లో లోధా సంస్కరణల మార్పు చేపట్టాడు. అతడి అధ్యక్షతన జరిగిన తొలి ఏజీఎమ్‌లో లోధా సంస్కరణల మార్పుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక మిగిలింది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆమోదం తెలపడమే. ‘లోధా సంస్కరణల మార్పుకు ఆమోదం తెలిపారు. దీన్ని సుప్రీంకోర్డు ఆమోదించాల్సి ఉంది’ అని సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు. న్యాయస్థానం ఆమోదిస్తే బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లో వరుసగా ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న ఆఫీస్‌ బేరర్‌.. మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలనే లోధా కమిటీ షరతు ఇక ఉండదు. బంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఐదేళ్లు పనిచేసిన దాదా తొమ్మిది నెలల్లో బీసీసీఐ అధ్యక్ష పదివిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో గంగూలీ 2024 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది. అతడితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పూర్తికాలం తన పదవిలో కొనసాగవచ్చు. బీసీసీఐ పాలనలో అడుగడుగున అడ్డంకిగా మారుతున్న లోధా సంస్కరణలకు దాదా చరమగీతం పాడినట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *