బీజేపి పాలనలో… ప్రభుత్వరంగ సంస్థలకు ఎసరు

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి

మహబూబ్‌నగర్‌, అక్షిత ప్రతినిధి :

కుల, మత రాజకీయాలతో భారతీయ జనతా పార్టీ యువతను రెచ్చగొడుతున్నదని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని విమర్శించారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీతో పాటు రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, విద్యుత్ సంస్థలను ప్రయివేట్ పరంచేయడం ద్వారా ప్రధాని మోడీ.. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి నియోజకర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గతంలో ఇక్కడ గెలుపొందిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్, రాంచందర్ రావులు పట్టభద్రులకు చేసిందేమీ లేదన్నారు. ఈసారి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సురభీ వాణీదేవిని గెలిపించాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై మంత్రి వివరించారు. గత ప్రభుత్వాలు మహబూబ్‌నగర్ జిల్లాను నిర్లక్ష్యం చేశాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమి లేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. నెలరోజుల్లోనే 50 వేలకుపైగా అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగాల కల్పనకు చేసిందేమి లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *