Chandrababu, KCR,Telangana Elections, Mahakutam

బాబు అంటే కేసీఆర్ లో ఎందుకంత ఇరిటేష‌న్‌?

తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను రెగ్యుల‌ర్ గా ఫాలో అయ్యే వారికి.. కొన్ని విష‌యాల్లో ఆయ‌నేం చేయ‌బోతున్నార‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మైపోతుంది. అంతేకాదు.. ఆయ‌న మైండ్ సెట్ ఎలా ఉంద‌న్న అంశంపైనా స్ప‌ష్ట‌త వ‌స్తుంది. త‌న‌కు తిరుగులేని రీతిలో చుట్టూ వాతావ‌ర‌ణం ఉంటే.. పెద్ద‌గా విమ‌ర్శ‌లు లేకుండా.. బండి లాగించేయ‌టం కేసీఆర్‌కు అల‌వాటు. ఆ మాట‌కు వ‌స్తే.. త‌న‌కు ఎలాంటి ఢోకా లేద‌న్న భావ‌న ఉన్న‌ప్పుడు ఆయ‌న మీడియా ముందుకు రావ‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు. ఒక‌వేళ వ‌చ్చినా.. ఆచితూచి అన్న‌ట్లుగా మాట్లాడ‌తారే కానీ మాట మిగిలే ప్ర‌య‌త్నం చేయ‌రు. అదే స‌మ‌యంలో తాను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన‌ట్లు అనిపించినా.. త‌న ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంద‌నుకున్నా.. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం నెల‌కొంద‌న్న భావ‌న‌లో ఉన్నా ఆయ‌న మాట‌లు మారిపోతాయి.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై కేసీఆర్ మాట‌లు మ‌రింత ప‌దునెక్కాయి. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మొన్న‌టి వ‌ర‌కూ తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీనే లేద‌ని తేలిగ్గా తీసి పారేసిన కేసీఆర్‌.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆగ‌మాగం అయిపోతూ.. తీవ్ర విమ‌ర్శ‌ల్ని సంధిస్తున్నారు. తాజాగా ఎన్నిక‌ల హామీల జాబితాను వెల్ల‌డించేందుకు ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న చంద్రబాబుపై తీవ్ర‌స్థాయిలో దునుమాడారు. బాబు ఇక్క‌డికి వ‌చ్చి రాజ్యం ఏల‌తారా? ఆయ‌న‌కు డిపాజిట్లు వ‌స్తాయా? మెజార్టీ లేకున్నా గెలిచేందుకు ప్ర‌య‌త్నించి ఓటుకు నోటు కేసులో ఇరికినా ఆయ‌న‌కింకా సిగ్గు.. బుద్ధి రాలేదా? బ‌రాబ‌ర్ అంటాం రాజ‌కీయ నాయ‌కుడు కాదా? ప్ర‌శాంతంగా ఉన్నోళ్ల మ‌ద్య కొర్రాయి పెడ్తున్న‌డు అంటూ కేసీఆర్ మాట‌ల్లోనే బాబుపై ఎందుకంత ఆగ్ర‌హంతో ఆయ‌న చెప్పేశార‌ని చెప్పాలి.

బాబు కానీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుంటే.. కేసీఆర్ విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌క‌నే. కానీ.. కాంగ్రెస్‌.. టీడీపీ.. టీజేఎస్‌.. సీపీఐ ఓట్లు అన్ని క‌లిస్తే కేసీఆర్ కు ఇబ్బందే. అందునా.. టీడీపీ కాంగ్రెస్ క‌లిస్తే ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. వేర్వేరుగా.. ఎవ‌రికి వారుగా పోటీ చేస్తారు.. ఓట్ల చీలిక‌తో తాము ల‌బ్థి పొందొచ్చ‌న్న భావ‌న‌లో ఉన్న కేసీఆర్ కు మ‌హాకూట‌మి వ్య‌వ‌హారం ఒక ప‌ట్టాన మింగుడుప‌డ‌నిదిగా మారింది. అదే స‌మ‌యంలో.. మ‌హాకూట‌మిపై అంచ‌నాలు అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వేళ‌.. కేసీఆర్ కు అంద‌తున్న నెగిటివ్ రిపోర్ట్స్ ఆయ‌న మాట‌ల్లో తేడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోందంటున్నారు. ప్ర‌శాంతంగా ఉన్నోళ్ల మ‌ధ్య కొర్రాయి పెడ్తున్న‌డ‌న్న కేసీఆర్ మాట‌లోనే బాబు ఫోబియో ఎంతన్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేసీఆర్‌లో బాబు ఫోబియో పెరిగే కొద్దీ.. ఆయ‌న మాట‌ల్లో తీవ్ర‌త అంత‌కంత‌కూ పెర‌గ‌టం ఖాయ‌మని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:Chandrababu, KCR,Telangana Elections, Mahakutami

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *