ఫైనల్‌లో తెలుగు రాకెట్ – పీవీ సింధు

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ తార పూసర్ల వెంకట సింధు తనపై అంచనాలు నిలబెట్టుకుంది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రత్యర్థి, నాలుగో సీడ్‌ యూఫీచెన్‌ (చైనా)ను 21-7, 21-14 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. వరుసగా మూడో సారి ఫైనల్‌కు చేరుకొని పసిడి పోరుకు బాటలు వేసుకొంది. ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు గెలిచిన సింధుకు ఇప్పటి వరకు స్వర్ణం అందని ద్రాక్షగా మిగిలింది. ఈ సారి ఎలాగైనా దాన్ని తన మెడలో ధరించాలని ఉవ్విళ్లూరుతోంది.

దూకుడు మంత్రం

సెమీస్‌లో ఆమె దూకుడుకు చైనా అమ్మాయి యూఫీచెన్‌ నుంచి సమాధానమే లేదు. క్వార్టర్స్‌లో తైజు ఇంగ్‌పై ఆధిపత్యం చెలాయించినట్టే ఆమెపై స్మాష్లతో దండయాత్ర చేసింది. క్రాస్‌కోర్టు షాట్లతో నలువైపులా తిప్పింది. ప్రత్యర్థి తెలివిగా ఆడినప్పుడు సుదీర్ఘ ర్యాలీలతో చుక్కలు చూపించింది. తొలిగేమ్‌లో 4-1తో సింధు దూసుకుపోయింది. అదే జోరు కొనసాగిస్తూ వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. 8-2తో ఆధిక్యంలో నిలిచింది. యూఫీ ఒక పాయింట్‌ సాధించినా ఆమెకు మరో అవకాశం ఇవ్వలేదు సింధు. వరుస పాయింట్లు సాధిస్తూ 8-3 నుంచి 14-3తో దుమ్మురేపింది. కసిగా ఆడుతూ 21-7తో గేమ్‌ గెలిచింది.

రెండో గేమ్‌లో మాత్రం ఈ తెలుగమ్మాయికి కాస్త ప్రతిఘటన ఎదురైంది. యూఫీ ర్యాలీగేమ్‌ ఆడింది. తొలుత ఇద్దరూ చెరో పాయింట్ సాధిస్తూ 3-3తో నిలిచారు. యూఫీ పోరాడేందుకు నిర్ణయించుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. 5-4 వద్ద ఏకంగా 36 షాట్ల సుదీర్ఘ ర్యాలీ ఆడారు. సింధు మాత్రం తన జోరు ఆపలేదు. అనవసర తప్పిదాలు చేయలేదు. 13-7 వద్ద, 19-10 వద్ద 2 6 షాట్ల ర్యాలీ ఆడింది. మధ్యలో స్మాష్‌లు బాదింది. క్రాస్‌కోర్టు షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరికి 21-14తో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *