ఫిబ్రవరిలో …యాదాద్రి ఆలయ ప్రారంభం : కేసీఆర్‌

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ :  యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తికావచ్చాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. చినజీయర్‌ స్వామి సంకల్పం మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆలయ ప్రారంభం ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా 1008 కుండాలతో మహా సుదర్శనయాగం చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ పీఠాలన్నింటి నుంచి స్వాములను పిలిపించాలని జీయర్‌స్వామిని వేడుకొన్నానని, దీనికి ఆయన ఒప్పుకొన్నారని తెలిపారు. తాను ఎక్కడకు వెళ్లినా అందరూ స్వామి వారి ప్రతిభ గురించి చెప్తున్నారని సీఎం కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. తాను శ్రీరంగంలో స్వామి పేరుచెప్తే.. ‘మీ జీయర్‌ స్వామి’ అని వాళ్లు అన్నారని, అందుకు తాను.. ‘మీకు స్వామి కాదా?’ అని అంటే.. మాకు కూడా స్వామియేనని చెప్పారని వివరించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ గ్రామంలో చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో జరిగిన తిరునక్షత్రోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. సీఎం దంపతులకు చినజీయర్‌ స్వామి పట్టువస్ర్తాలు అందించి, ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలోని పలు ప్రాంతాల్లోని పండితులను యాదాద్రిలో జరిగే మహా సుదర్శనయాగానికి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ‘చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో విశేష యాగాన్ని తలపెట్టాం. ఆలయసేవలకు భంగం కలుగకుండా మీకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేస్తం. మీరు రోజు వచ్చి మా కార్యక్రమంలో పాల్గొనాలి’ అని కోరితే ఆ పండితులు సంతోషపడ్డారని చెప్పారు. యాదాద్రి పునర్నిర్మాణంపై జీయర్‌స్వామి సలహాలు అపారమైనవని అన్నారు. ఆయన మీద ఉండే విశ్వాసం, భక్తితో యాదాద్రి పునర్నిర్మాణ పనులు చేపట్టామని చెప్తే తిరుమల ప్రధాన అర్చకులు చూడటానికి వచ్చి చాలా వైభవంగా ఉన్నదన్నారని, యాగానికి కూడా వస్తామని చెప్పారని పేర్కొన్నారు. మహాసుదర్శన యాగం, రామానుజ జీయర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాలు గొప్పగా జరుగుతాయని చెప్పారు. యాదాద్రికి అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోవచ్చునని, కానీ, శుభప్రదమైన తిరునక్షత్రం రోజున.. ఈ వేదిక నుంచి ఆహ్వానిస్తున్నానని చెప్తూ.. మహాసుదర్శన యాగానికి మీరంతా వచ్చి, స్వామి వారిచేత ప్రసాదం స్వీకరించాలని కోరారు. యాగ నిర్వహణ బాధ్యత, క్రమశిక్షణతో ఉండే వికాస తరంగిణికి అప్పగిస్తామని ప్రకటించారు. భగవండిని పూజించే సంస్కారం, ఆచారం తనకు తల్లిదండ్రుల నుంచే పరంపరగా వచ్చిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. చినజీయర్‌ స్వామి 1986-87 ప్రాంతంలో సిద్దిపేటలో బ్రహ్మయజ్ఞం చేయాలని తలపెట్టారని, ఆ సమయంలో స్వామి తనను అనుగ్రహించి, ఆ ఏడురోజులు తమ ఇంట్లోనే బసచేశారని గుర్తుచేసుకున్నారు. స్వామికి తానే కారు డ్రైవర్‌గా మారిపోయానన్నారు. యాగం మధ్య బ్రహ్మాండమైన వర్షం కురుస్తుందని స్వామి చెప్తే తాను నమ్మలేదని, కానీ సరిగ్గా యజ్ఞం ఐదోరోజు కార్యక్రమాలు పరిసమాప్తి అయ్యే సమయంలో అద్భుతమైన వర్షం వచ్చిందన్నారు. అప్పటి పరిస్థితుల్లో అశాంతి, హత్యల వంటివి జరుగకూడదని తాను ప్రత్యేకంగా ప్రార్థిస్తే స్వామి అనుగ్రహించి సిద్దిపేటలో శాంతి మంత్రాలు జపిస్తూ పట్టణమంతా శాంతియాత్ర కూడా చేశారని గుర్తుచేశారు.  మన హైందవ మతం, మన సంస్కారం చాలా బలంగా ఉంటాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘ఒకరోజు రవీంద్రభారతిలో సిద్ధాంతిగారిని వారి షష్టిపూర్తి సందర్భంగా పల్లకిలో మోసుకెళ్లి గొప్పగా కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు అక్కడున్న స్వాములు ‘హైందవ సంప్రదాయం మీద దాడి జరుగుతున్నది. కంసుడిని పూజించాలనే దుర్మార్గులు బయదేరారు. ఇది చాలా ప్రమాదకరం’ అని చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో స్వామివారు తనను మాట్లాడాల్సిందిగా కోరితే.. ‘చిన్న పాపాయిని లాలిస్తూ తల్లి ‘జో అచ్యుతానంద.. జోజో ముకుంద.’ అని పాడుతుందే తప్ప.. ‘జో దుర్యోధన.. జో కుంభకర్ణ.. జో కంస’.. అని ఏ తల్లి కూడా పాడదు. అటువంటి ఆదర్శం చనుబాలు తాగిస్తూనే ఆ తల్లి పిల్లవానికి అందిస్తుంది. అంత బలమైన సంప్రదాయానికి, మన పద్ధతికి అసలు విఘాతం కలిగే ప్రశ్న లేనేలేదు.. ఎవ్వరూ గాభరాపడకండి’ అని చెప్పానని గుర్తుచేసుకున్నారు. అట్లాంటి సందర్భం వస్తే జీయర్‌స్వామి లాంటివారు చాలామంది ఉన్నారని, వారే కాపాడుతారని, లక్షలమంది మంది భక్తులను తయారుచేస్తారని చెప్పానని తెలిపారు.  చినజీయర్‌స్వామి సంకల్పం మేరు రామానుజ జీయర్‌స్వామి హైదరాబాద్‌లో వెలియడం మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో తాను ఒక సేవకుడిగా పనిచేస్తానని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన కొంతమంది శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగుతుంటే పెద్ద విగ్రహం కనిపించిందని, అది ఎవరిదని తనను అడిగారని, అందుకు తాను.. అది తమకు పెద్ద గురువు, రెవల్యూషనరీ గురువుదని చెప్పానని తెలిపారు. స్వామిని తిరునక్షత్రం సందర్భంలో దర్శించుకోవడమే మహాభాగ్యమని చెప్పారు. ఈ రోజు మా తల్లిగారి ఆబ్దికం ఉంటే బంధువులంతా వచ్చారని, తాను తిరునక్షత్రం వేడుకల్లో పాల్గొనేందుకు చినజీయర్‌స్వామి ఆశ్రమానికి వెళుతున్నానని చెప్తే వారంతా కూడా తనతో వచ్చారని తెలిపారు. ‘స్వామివారి దివ్య విగ్రహం దివ్యదేశాలకు సంబంధించిన అద్భుతమైన ప్రాంగణం. ఇది ఇండియాలో ఎక్కడా దొరుకదు. 108 క్షేత్రాలు తిరిగితే తప్ప ఆ భాగ్యం కలుగదు’ అని చెప్పారు. ఇంతటి మహా ప్రాంగణం హైదరాబాద్‌వాసులకు గర్వకారణమని, పూర్వజన్మ సుకృతమని అన్నారు. దీని నిర్మాణంలో జూపల్లి రామేశ్వరరావు కృషి అపారమైనదంటూ ప్రశంసించారు. జీయర్‌స్వామి తనను అనుగ్రహించి, మంగళాశాసనం చేసి, వస్ర్తాలు, పెద్దస్వామి సేవలకు సంబంధించిన పెద్ద పుస్తకాన్ని బహూకరించారని చెప్తూ.. ధన్యవాదాలు తెలిపారు.  ‘విశ్వ శరీరి అయిన భగవంతుడు ఒక్కడే. ఆయన దయామయుడు. జాతి, కులం, విద్య, సంపదలతో సంబంధం లేకుండా ఆ దైవానుగ్రహం పొందేందుకు అందరూ యోగ్యులేనని మొదటగా లోకానికి చాటిన మహనీయులు భగవద్రామానుజులు, శ్రీశ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి’ అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి వక్కాణించారు. చినజీయర్‌స్వామివారి తిరునక్షత్ర మహోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని ముచ్చింతల్‌ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలో ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చినజీయర్‌స్వామి భక్తులకు మంగళాశాసనాలు అనుగ్రహించారు. స్వామి అనుగ్రహభాషణంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్యాత్మిక, సామాజిక, పాలనాపరమైన ప్రజాసేవను కొనియాడారు. సమాజంలో వేదం జ్ఞానప్రసాదం వంటిదని, సర్వానికి వేదమే మూలాధారమని తెలిపారు. వేద వాంగ్మయంతోనే పెద్దజీయర్‌ స్వామి.. సమాజంలో నిర్లక్ష్యానికి గురైన ఉపేక్షిత, దళితవర్గాలకు దేవాలయప్రవేశం కల్పించి మంత్రోపదేశం చేశారని, సంఘసంస్కర్తగా నిలిచారని తెలిపారు. వారు సంస్కరించిన ఉదాత్త సామాజిక, ధార్మిక చైతన్య ఉద్యమంలో ప్రతిఒక్కరు సమాజశ్రేయస్సులో భాగస్వాములుకావాలని పిలుపునిచ్చారు. భగవద్రామానుజులవారి సహస్రాబ్ది ఉత్సవాల గురించి తెలియజేశారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవల్లో మై హోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు కృషి అద్వితీయమని అభినందించారు. జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ తిరునక్షత్ర మహోత్సవాలు అత్యంతవైభవంగా ఇక్కడ జరుగటంతో ఈ ప్రాంతం పునీతమైందన్నారు. సమాజశ్రేయస్సుకు అహర్నిశలు కృషిచేస్తున్న చినజీయర్‌స్వామి 126 ఏండ్లపాటు జీవించాలని ఆకాంక్షించారు. పలువురు పీఠాధిపతులు మాట్లాడుతూ చినజీయర్‌ సంస్థల సామాజిక, ఆధ్యాత్మిక సేవలను ప్రశంసించారు. అంతకుముందు చినజీయర్‌స్వామి దివ్యసాకేతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామీజీకి ఆశీస్సులు అనుగ్రహించారు. చినజీయర్‌ తిరునక్షత్ర మహోత్సవం వేడుకల ప్రారంభానికి సీఎంతోపాటు మై హోం అధినేత, టీటీడీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావుతోపాటు బెంగళూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కమలానందభారతిస్వామి, మంత్రాలయ పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థస్వామి, శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్‌ జీయర్‌మఠం పీఠాధిపతి శఠగోప రామానుజజీయర్‌స్వామి, అహోబిల జీయర్‌ స్వామి, దేవనాథ జీయర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ సంతోష్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో జీయర్‌ అవార్డు-2019ను కాకతీయ వీర య్య, తిరుపతి వాస్తవ్యులు మద్దులపల్లి సూర్యనారాయణ ఘనాపాటి, సలక్షణ ఘనాపాటి పురుషోత్తమాచార్యులకు ప్రదానం చేశారు. చినజీయర్‌స్వామి స్వీయపర్యవేక్షణలో వివిధ ప్రాంతాలకు చెందిన పండితులు భగద్రామానుజుల ఆధ్యాత్మిక, సామాజిక సేవాకార్యక్రమాలపై చర్చించారు. చినజీయర్‌స్వామివారికి టీటీడీ అధికారులు వేంకటేశ్వరస్వామి శేషవస్ర్తాలను, ప్రసాదాన్ని అందజేశారు.

 

tags : cm kcr, yadadri, chinajeeyarswamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *