లౌక్యఃపంచాయతీ ఎన్నికల సమరం నేటి నుంచి ప్రారంభం అవుతోంది. తొలి విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్లను సోమవారం నుంచే స్వీకరిస్తారు. రాష్ట్రంలో 12732 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి ఒకటిన షెడ్యూల్ జారీ చేసింది. తొలి విడతగా 197 మండలాల్లో 4480 పంచాయతీల్లోని సర్పంచ్ పదవులు, వీటి పరిధిలోని 39,832 వార్డు పదవులకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరిస్తారు. 3-4 పంచాయతీలకు కలిపి ఒకచోట నామినేషన్లను స్వీకరిస్తున్నారు. తొలి విడతలో 50 లక్షల మంది ఓటర్లున్నారు. తొలి విడత నామినేషన్లు స్వీకరించే మూడు రోజులూ శుభదినాలుగానే భావిస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో పాడ్యమి, విదియ, తదియ గడియలు ఉన్నాయి. మంగళవారం నెగిటివ్ సెంటిమెంటు ఉండేవారు సోమ లేదా బుధవారాల్లో నామినేషన్లు వేసే అవకాశం ఉంది.
రెండు చోట్ల పోటి చేయరాదు..
పంచాయతీలో ఒకటి కన్నా ఎక్కువ వార్డులకు పోటీ చేయడం కుదరదు. రెండు చోట్ల నామినేషన్ వేసినా ఉపసంహరణ గడువు ముగిసే నాటికి ఒకటే ఎంచుకోవాలి. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి వార్డు పదవికి కూడా పోటీ చేయవచ్చు. రెండు పదవుల్లో విజయం సాధిస్తే నిర్ధేశించిన గడువులోగా ఏదో ఒక పదవిని వదులుకోవాలి. జడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా సర్పంచ్ , వార్డు సభ్యుల పదవులకు పోటీ చేయవచ్చు.
కొత్త ఖాతా నిబందన మినహయింపు..
కొత్త బ్యాంకు ఖాతాలను తెరవాలన్న నిబంధనను పంచాయతీకి మినహాయించారు. ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాలను కూడా ప్రస్తుత ఎన్నికలకు వినియోగించుకోవచ్చని, ఎన్నికలు ముగిసే వరకు ఈ ఖాతా నుంచి ఇతర లావాదేవీలు జరపకూడదని ఎస్ఈసీ ఆదేశించింది. ఖాతా నెంబరు వివరాలను నామినేషన్ పత్రంలో పేర్కొనాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలకు వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తారని, వారందరికీ వెంటనే బ్యాంకు ఖాతాలు తెరవడం ఇబ్బందేనని పలువురు క్షేత్ర స్థాయి అధికారుల దృష్టికి తేవడంతో, కొత్త ఖాతాల నిబంధనను మినహాయించారు.