ప్రైవేట్ టీచర్లకు ఆసరా

ప్రైవేట్ టీచర్లకు రూ.2 వేల ఆర్థిక సాయం.. సీఎం కేసీఆర్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల మూసివేతతో ఇబ్బందులు పడుతున్న టీచర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల టీచర్లు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయనున్నట్టు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆర్థిక సాయాన్ని పొందేందుకు ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ.. విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. ప్రయివేటు విద్యాసంస్థల టీచర్లు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1.45 లక్షల మంది టీచర్లు, ఇతర సిబ్బందికి లబ్ధిచేకూరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *