ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా

ప్రయివేట్ ఆస్పత్రుల అధిక ఫీజులపై ప్రభుత్వం సీరియస్

★ నిర్లక్ష్య వైద్యంపై కఠిన చర్యలకు దిగిన ప్రభుత్వం

★ 5 ప్రయివేటు దవాఖానల కొవిడ్‌ చికిత్స లైసెన్స్‌ రద్దు

★ మరో 64 ప్రయివేటు హాస్పిటళ్లకు షోకాజ్‌ నోటీసులు

★ కేటీఆర్‌ ట్వీట్‌ చేసిన గంటల వ్యవధిలో చర్యలు

★ ప్రయివేటు దవాఖానలపై నిరంతరం నిఘా

★ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

★ డీఎంహెచ్‌ శ్రీనివాసరావు హెచ్చరిక

★ ఫిర్యాదులకు వాట్సాప్‌ నంబర్‌ 91541 70960

హైదరాబాద్ అక్షిత ప్రతినిధి :

కొవిడ్‌ చికిత్స పేరుతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ప్రయివేటు దవాఖానలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, బాధితులను పీల్చి పిప్పిచేస్తున్న హాస్పిటళ్లపై కఠిన చర్యలు ప్రారంభించింది. నిర్లక్ష్య వైద్యంతో పాటు నిబంధనలను అతిక్రమించిన ఐదు దవాఖానల కొవిడ్‌ చికిత్స అనుమతులను రద్దుచేసింది. మరో 64 దవాఖానలకు నోటీసులు జారీచేసింది. ప్రజల డబ్బు దోచుకుంటూ, ప్రాణాలతో చెలగాటం ఆడేవారిని ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది. ప్రయివేట్‌ దవాఖానల్లో నిర్లక్ష్య వైద్యంపై వచ్చిన ఓ ఫిర్యాదుపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌చేసిన కొన్ని గంటల్లోనే చర్యలు మొదలయ్యాయి.

కొవిడ్‌ చికిత్స లైసెన్స్‌ రద్దు అయిన దవాఖానలు..
దవాఖాన ఫిర్యాదులు
విరించి (బంజారాహిల్స్‌) 1
విన్‌ (బేగంపేట) 5
టీఎక్స్‌ (కాచిగూడ) 3
నీలిమ (సనత్‌నగర్‌) 1
మ్యాక్స్‌ హెల్త్‌ (కేపీహెచ్‌బీ) 2

నిర్లక్ష వైద్యం, ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న విరించి, విన్‌, టీఎక్స్‌, నీలిమ, మ్యాక్స్‌ హెల్త్‌ దవాఖానల కొవిడ్‌ చికిత్స లైసెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. ఈ దవాఖానలపై ఇప్పటికే బాధితుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రొటోకాల్‌ పాటించకుండా ఇష్టారీతిన వైద్యం చేస్తున్నారని, పడకల అందుబాటుపై సరైన సమాచారం ఇవ్వడం లేదని.. ఇలా అనేక లోపాలపై బాధితులు వైద్యారోగ్యశాఖ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. హైదరాబాద్‌ బేగంపేటలోని విన్‌ హాస్పిటల్‌పై ఐదు, కాచిగూడలోని టీఎక్స్‌ దవాఖానపై మూడు, కేపీహెచ్‌బీలోని మాక్స్‌హెల్త్‌ హాస్పిటల్‌పై రెండు, బంజారాహిల్స్‌లోని విరించి, సనత్‌నగర్‌లోని నీలిమ దవాఖానలపై ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం.. వివరణ కోరుతూ ఆయా దవాఖానలకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. నిర్లక్ష్య వైద్యం కారణంగా నల్లగొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ మరణించాడన్న ఆరోపణలపై విరించి దవాఖానకు నోటీసులు జారీచేశారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని దవాఖాన యాజమాన్యాన్ని ఆదేశించారు. అధిక ఫీజుల వసూలుపై విన్‌, మ్యాక్స్‌హెల్త్‌, నీలిమ, టీఎక్స్‌ దవాఖానలు వివరణ ఇవ్వగా.. అధికారులు సంతృప్తి చెందలేదు. విరించి హాస్పిటల్‌ యాజమాన్యం అసలు సమాధానమే ఇవ్వలేదు. దీంతో అధికారులు ఐదు దవాఖానలపై కొరడా ఝళిపించారు. తెలంగాణ అల్లోపతిక్‌ ప్రైవేట్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌-2002, ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌-1897 ప్రకారం చర్యలు తీసుకున్నారు. కొవిడ్‌ చికిత్స అనుమతులను రద్దుచేశారు. కొత్తగా కొవిడ్‌ రోగులను చేర్చుకోవద్దని, ఇప్పటికే ఆయా దవాఖానల్లో ఉన్న కరోనా రోగులకు చికిత్స కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై ఆయా దవాఖానలు నిబంధలను అతిక్రమిస్తే ఏకంగా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది.

అధిక చార్జీలపై ఆవేదన.. మంత్రి కేటీఆర్‌ స్పందన:

హైదరాబాద్‌లోని విరించి దవాఖానలో నిర్లక్ష్య వైద్యం కారణంగా ఓ వ్యక్తి మరణించాడని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి విచారణ జరుపాల్సిందిగా వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావుకు సూచించారు. ఈ మేరకు విచారణ చేపట్టి.. విరించి దవాఖానతోపాటు నిబంధనలు పాటించని ఐదు దవాఖానలపై వైద్యారోగ్యశాఖ -వేటువేసింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విరించి దవాఖానపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు విచారణ జరిపి గతేడాది ఆగస్టు 5న దవాఖానకు కొవిడ్‌ చికిత్స లైసెన్స్‌ను రద్దుచేసింది. తీరు మార్చుకోకపోవడంతో తాజాగా మరోసారి వేటు వేసింది.

ప్రయివేట్‌ వైద్యంపై నిఘా :

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 1200 ప్రయివేట్‌ దవాఖానల్లో కొవిడ్‌ చికిత్స అందుతున్నది. అధికంగా ఫీజులు వసూలు చేసినా, నిర్లక్ష్య వైద్యం చేసినా, సేవల్లో ఎలాంటి లోపం కలిగినా వదిలిపెట్టబోమని ప్రభుత్వం మొదటి నుంచీ హెచ్చరిస్తూ, నిఘా పెట్టంది. సేవా లోపాలపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు సుమారు నెల రోజుల కిందట ప్రత్యేకంగా వాట్సప్‌ నంబర్‌ 9154170960 ను కేటాయించింది. ఈ నంబర్‌కు సుమారు 900 ఫిర్యాదులు వచ్చాయి. ప్రధానంగా 64 దవాఖానలపై అధిక చార్జీల వసూలు, నిర్లక్ష్య వైద్యం, సరైన సమాచారం ఇవ్వకపోవడం తదితర 88 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా కూకట్‌పల్లిలోని ఓమ్ని దవాఖానపై ఆరు, బేగంపేటలోని విన్‌ హాస్పిటల్‌పై ఐదు, కాచిగూడలోని టీఎక్స్‌ దవాఖాన, అబిడ్స్‌లోని ఉదయ్‌ ఓమ్ని హాస్పిటల్‌పై మూడు చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు ఆయా దవాఖానలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఎవరినీ వదిలిపెట్టం : డీఎంహెచ్‌ శ్రీనివాసరావు
కొవిడ్‌ చికిత్స అందిస్తున్న ప్రయివేట్‌ దవాఖానల్లో అధిక ఫీజుల వసూలు, ఇతర సేవాలోపాలపై మొదటివేవ్‌ సమయం నుంచే నిఘా పెట్టాం. ఇప్పటికే కొన్ని దవాఖానలపై చర్యలు తీసుకున్నాం. వైద్యారోగ్యశాఖ ప్రవేశపెట్టిన వాట్సప్‌ నంబర్‌ 9154170960కు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి ఆధారంగా 64 దవాఖానలకు షోకాజ్‌ నోటీసులు జారీచేశాం. స్పందించని, సరైన వివరణ ఇవ్వనివారిపై వేటు వేశాం. మిగతా దవాఖానల వివరణను పరిశీలించి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదు. కచ్చితంగా ప్రొటోకాల్‌ ప్రకారమే చికిత్స అందించాలి.

షోకాజ్‌ నోటీసులు పొందిన దవాఖానలు ఇవే…

హైదరాబాద్‌ పరిధిలో..

1. ఓమ్ని హాస్పిటల్‌ (కూకట్‌పల్లి)
2. మాక్స్‌ హెల్త్‌ (కూకట్‌పల్లి)
3. పద్మజ (కేపీహెచ్‌బీ)
4. శ్రీ శ్రీ హోలిస్టిక్‌ (కేపీహెచ్‌బీ)
5. విన్‌ (బేగంపేట్‌)
6. టీ ఎక్స్‌ (కాచిగూడ)
7. ఉదయ్‌ ఓమ్నీ (అబిడ్స్‌)
8. రక్ష (ఎల్బీనగర్‌)
9. అంకుర (ఎల్బీనగర్‌)
10. గ్లోబల్‌ (ఎల్బీనగర్‌)
11. అరుణ (హస్తినాపురం)
12. మ్యాక్సీ క్యూర్‌ (బీఎన్‌ రెడ్డి నగర్‌)
13. లైఫ్‌లైన్‌ (అల్వాల్‌)
14. లోటస్‌ (లక్డీకాపూల్‌)
15. సాయి సిద్ధార్థ (షాపూర్‌నగర్‌)
16. కిమ్స్‌ (కొండాపూర్‌)
17. సియా లైఫ్‌ (కొండాపూర్‌)
18. కిమ్స్‌ (సికింద్రాబాద్‌)
19. శ్రీకర (సికింద్రాబాద్‌)
20. సన్‌షైన్‌ (సికింద్రాబాద్‌)
21. వీఆర్‌ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ (న్యూ బోయిన్‌పల్లి)
22. ఆదిత్య (ఉప్పల్‌)
23. అపోలో (హైదర్‌గూడ)
24. ఆశ (కాప్రా)
25. అశ్విన్స్‌ హాస్పిటల్‌ (పంజాగుట్ట)
26. ఆస్టర్‌ ప్రైమ్‌ (అమీర్‌పేట్‌)
27. ఇమేజ్‌ (అమీర్‌పేట్‌)
28. కేర్‌ (బంజారాహిల్స్‌)
29. సెంచరీ (బంజారాహిల్స్‌)
30. కాంటినెంటల్‌ (గచ్చిబౌలి)
31. హ్యాపీ (మదీనాగూడ)
32. హరీశ్‌ (చందానగర్‌)
33. హైదరాబాద్‌ నర్సింగ్‌ హోమ్‌
34. ఇంటెగ్రో (మెహదీపట్నం)
35. మెడిసైస్‌ (చింతలకుంట)
36. ఎన్‌ కేర్‌ (ఆర్సీపురం)
37. నవజీవన్‌ (కార్ఖానా)
38. రెనోవా నీలిమ (సనత్‌నగర్‌)
39. నీలిమ (సనత్‌నగర్‌)
40. నిఖిల్‌ (శ్రీనగర్‌ కాలనీ)
41. ఓమ్ని (కొత్తపేట)
42. పంచవటి (భూత్‌పూర్‌)
43. ప్రసాద్‌ (మియాపూర్‌)
44. ప్రతిమ (కూకట్‌పల్లి)
45. రాఘవేంద్ర (బోయిన్‌పల్లి)
46. షాలిని (బర్కత్‌పుర)
47. షన్ముఖ వైష్ణవి (చైతన్యపురి)
48. శారద (ఘట్‌కేసర్‌)
49. శ్రీ శ్రీ హోలిస్టిక్‌ (నిజాంపేట్‌)
50. సన్‌రిడ్జ్‌ (మోతీనగర్‌)
51. సన్‌షైన్‌ (గచ్చిబౌలి)
52. సుప్రజ (నాగోల్‌)
53. తుంబే (మలక్‌పేట్‌)
54. ట్రీట్‌మెంట్‌ రేంజ్‌
55. ట్రైడెంట్‌ (శంషాబాద్‌)
56. టీఎక్స్‌ (ఉప్పల్‌).

ఇతర జిల్లాల్లో…..
57. ఒమెగా బన్ను (వరంగల్‌)
58. మాక్స్‌కేర్‌ (వరంగల్‌)
59. లలిత (వరంగల్‌)
60. స్టార్‌ హెల్త్‌ కేర్‌ (హన్మకొండ)
61. జయ నర్సింగ్‌ హోమ్‌ (హన్మకొండ)
62. అజర (హన్మకొండ)
63. అంకం (నిజామాబాద్‌)
64. సాయిరాం (సంగారెడ్డి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *