ప్రజారోగ్యం కోసం మెరుగైన సదుపాయాలు

ప్ర‌జారోగ్యమే  ప్ర‌భుత్వ ధ్యేయం : మంత్రి ఎర్ర‌బెల్లి 

వ‌రంగ‌ల్, అక్షిత ప్రతినిధి :

హైద‌రాబాద్ త‌ర్వాత అత్యంత ప్రాధాన్య‌త గ‌ల‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఆరోగ్య సదుపాయాల క‌ల్ప‌న‌లో ముందంజ‌లో ఉంద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. ఇందులో భాగంగానే ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని జ‌న‌గామ‌, మ‌హ‌బూబాబాద్, ములుగులోని ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో వైద్య ప‌రీక్ష‌ల కేంద్రాల‌ను ( డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్లు) ఈనెల9న ప్రారంభించనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వ ఆస్పత్రుల‌లో డాక్ట‌ర్లు ప‌రీక్ష చేసి మందులు రాస్తారు. కాని ప్రయివేట్ డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ల‌కు వైద్య ప‌రీక్ష‌ల కోసం వేలాది రూపాయ‌లు వ్య‌యం చేయ‌వ‌ల‌సి వ‌స్తుంద‌న్నారు. ఈ పరిస్థితులను అధిగ‌మించి డాక్ట‌ర్లు వ్రాసిన ప‌రీక్ష‌లు రోగుల‌కు ఉచితంగా చేయ‌డానికి ప్ర‌భుత్వ ఆస్పత్రుల‌లోని డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ల‌ను ప్ర‌తి ఒక్క‌రికి అందుబాటులోకి తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ప్ర‌భుత్వ డ‌యాగ్న‌స్టిక్ కేంద్రాల‌లో 57 ర‌కాల ప‌రీక్ష‌లు ఉచితంగా చేస్తార‌ని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జారోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్య‌త‌లో భాగంగా రూ. 150 కోట్ల వ్య‌యంతో నిర్మించిన కేఎంసీ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా, స‌మీప జిల్లాల్లోని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింద‌ని మంత్రి తెలిపారు. వ‌రంగ‌ల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని అన్ని హంగులతో కూడిన సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ‌యించార‌ని మంత్రి తెలిపారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలోనే కాకుండా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని జిల్లా కేంద్రాల్లో వైద్య‌, ఆరోగ్య సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు సీఎం ప్రాధాన్య‌తను ఇస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంలో మెడిక‌ల్ క‌ళాశాల‌తో పాటుగా న‌ర్సింగ్ క‌ళాశాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు చేసింద‌ని తెలిపారు. దీని వ‌ల్ల మ‌హ‌బూబాబాద్ ప్రాంత ప్ర‌జ‌ల చిర‌కాల కోరిక నెర‌వేర‌డంతో పాటుగా మెరుగైన వ్యైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయన్నారు. దీనికి తోడుగా భూపాల‌ప‌ల్లి, మ‌హ‌బూబాబాద్‌లో ఔష‌ధ ఉప కేంద్రాల‌ను ఏర్పాటు వ‌ల్ల ఔష‌దాల స‌ర‌ఫ‌రా మెరుగు అవుతుంద‌ని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *