‘పోలింగ్‌ రోజు దేనికైనా సిద్ధం’ : ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌, అక్షిత ప్రతినిధి :  మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల కుటుంబాల్లోని ప్రభుత్వ ఉద్యోగులను టీఆర్‌ఎస్‌ నేతలు బెదిరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. వారు పోలీసులను అడ్డుపెట్టుకుని వస్తున్నారని, వారి సంగతి పోలిం గ్‌ రోజు తేల్చుకుంటామని హెచ్చరించారు. ఆ రోజు తాను దేనికైనా సిద్ధంగా ఉంటానని, కార్యకర్తలు సైతం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ నేతలు దోపిడీ దొంగల ముఠా సభ్యులని, మునిసిపాలిటీలను ప్రజలు వారి చేతుల్లో పెట్టవద్దని కోరారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, టీడీపీ మునిసిపల్‌ అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ట్రిపుల్‌ తలాక్‌, మోదీపై అవిశ్వాసం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వంటి అంశాల్లో బీజేపీకి టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చిందని ఉత్తమ్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ బలపడితేనే ముస్లిం, మైనారిటీలకు మేలు జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు లేఅవుట్ల సొమ్మును, కలెక్టరేట్‌ భూముల వ్యవహారంలో సంపాదించిన సొమ్మును మునిసిపల్‌ ఎన్నికల్లో వెదజల్లుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ రెబల్‌గా పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. అనంతరం హుజూర్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లో ఉత్తమ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
tags : uttam, tpcc, hnr, election campaign

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *