పెరుగుతున్న కేసులు… అప్రమత్తంగా ఉందాం

వైద్యారోగ్య శాఖాధికారులతో మంత్రి ఈటెల

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ‌లో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలో రాష్ర్ట వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. బుధవారం ఉద‌యం వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో ఆ శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఫోన్‌లో మాట్లాడి ప‌రిస్థితిని స‌మీక్షించారు. క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ సంఖ్య పెంచాల‌ని అధికారుల‌కు మంత్రి సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ప‌ద్ద‌తి క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో గురువారం వైద్య శాఖ అధికారుల‌తో మంత్రి ఈటల రాజేంద‌ర్ అత్య‌వ‌స‌రం స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 684 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. వైరస్‌ ప్రభావంతో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. క‌రోనా‌ నుంచి 394 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,665 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రస్తుతం 1,873 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.కొత్త‌గా 684 పాజిటివ్ కేసులు… కొత్తగా రికార్డయిన కేసుల్లో అత్యధికంగా 184 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మంగళవారం రాష్ట్రంలో 56,122 టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,07,889కు చేరగా.. 3,01,227 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,697కు పెరిగింది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *