పవిత్ర దివ్యక్షేత్రంగా… యాదాద్రి

సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న యాదాద్రి 

తుది దశలో ఆలయ పునర్నిర్మాణ పనులు  

రేపు స్వయంగా పరిశీలించనున్న సీఎం కేసీఆర్

యాదాద్రి భువనగిరి, అక్షిత ప్రతినిధి :

 

సనాతన హిందూ ధర్మశాస్త్ర పరిరక్షణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన మదిలో ఉన్న ఆధ్యాత్మిక భావాలకు అనుగుణంగా తిరుమల తరహాలో శోభాయమానంగా యాదాద్రి దివ్యక్షేత్రం పరిఢవిల్లుతున్నది. స్వామి సన్నిధికి విచ్చేస్తున్న భక్తులను ప్రహ్లాద చరిత్ర ఘట్టాలు మరింత ఆధ్యాత్మికతను పంచనున్నాయి. మరో10 తరాల పాటు సీఎం కేసీఆర్ కృషి ఆచంద్రార్కంగా నిలిచిపోవడం ఖాయం. తిరుమల తరహాలో గండి చెరువు సమీపంలో రూ.15 కోట్లతో అధునాతన అన్నదాన సత్ర నిర్మాణం పూర్తయింది.ఇక్కడి గోపురాలు,ధ్వజస్తంభం,ప్రాకారాలు,మాడవీధులు,గర్భగుడి, క్యూలైన్లు,శివాలయం, ప్రసాద వంటశాల, యాగశాల, పుష్కరిణీ అద్వితీయంగా రూపు దిద్దుకున్నాయి. యాదాద్రి రూపు రేఖలే పూర్తిగా మారిపోయాయి. ఈ బృహత్కార్యంలో కేసీఆర్ గారు నిర్వర్తించిన కృషి అద్వితీయం, అజరామరం. సనాతన హిందూ ధర్మం అతి ప్రాచీనమైనది. ఆలయాల పరిరక్షణ, పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. యాదాద్రి పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం యాదాద్రి దివ్య క్షేత్రాన్ని సందర్శించనున్నారు. తోటి వారిని ప్రేమించమని, ప్రేమను పంచమని, ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం అందించాలని సనాతన హిందూ ధర్మం చెబుతోంది. సేవా భావాన్ని అలవర్చుకోవాలని ధర్మ శాస్త్రాలు ప్రభోదిస్తున్నాయి. యాదాద్రి పుణ్య క్షేత్రం అత్యంత పురాతనమైనది, చారిత్రకమైనది. పవిత్ర మనసుతో యాదాద్రి దివ్యక్షేత్రాన్ని సందర్శించినవారి కోర్కెలు నెరవేరుతున్నాయి. కొన్ని తరాలపాటు చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయేలా తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రి సిద్ధమవుతున్నది. ఇప్పటికే ప్రధాన ఆలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సాలహార విగ్రహాలు, ఆళ్వార్లమూర్తులు ప్రధాన ఆలయ స్తంభాలపై కొలువుదీరుతున్నాయి. నయనానందకరంగా ఉన్న యాదాద్రి క్షేత్రం ప్రారంభం ఎప్పుడెప్పుడా.. అని భక్తకోటి వేయి కన్నులతో ఎదురుచూస్తున్నది. ఇలలోనే వైకుంఠనగరంగా యాదాద్రి దివ్య క్షేత్రం రూపుదిద్దుకున్నది. ఉగ్రజ్వాలాముఖ గండభేరుండ యోగిపుంగవ లక్ష్మీనారసింహస్వామిని ఐదు రూపాలలో దర్శించుకోవడం కంటే జన్మకు సార్థకత ఏమున్నది! అపూర్వ నిర్మాణంతో ఇలలోనే వైకుంఠనగరాన్ని ఆవిష్కరిస్తున్న యాదాద్రి విరాట్‌రూపాన్ని చూడటానికి ఎన్ని కన్నులైనా సరిపోవు. ఆధ్యాత్మిక రాజధానిగా అద్భుత దివ్యక్షేత్రంగా యాదాద్రి అ వతరిస్తున్నది. విశాలమైన 17.32 ఎకరాల్లో పంచనారసింహుడి దివ్య సన్నిధాన పునర్నిర్మాణానికి ప్రారంభమైన మహామానవ ప్రయత్నం.. స్వామివారి దివ్య ఆశీస్సులతో పరిపూర్ణమవుతున్నది.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అత్యంత మహాద్భుతంగా, సువిశాలమైన స్థలంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ నగరిలో ఒక్కో కట్టడానికి ఒక్కో కొలతలు వేసి అందంగా, భక్తులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి కొండపై శిల్ప కళాసౌరభంగా రూపుదిద్దుకుంటున్న పంచనారసింహ క్షేత్రం నిర్మాణాలను 17.32 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇందులో 4.30 ఎకరాల్లో ప్రధానాలయం, బ్రహ్మోత్సవ మండపం, మాఢవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల రాజగోపురాలు, వేంచేపు మండపం, రథశాల, లిప్టు నిర్మించగా, పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆలయం చుట్టూ ప్రహరీని సైతం నిర్మిస్తున్నారు. పడమర దిశలో 125 మీటర్ల పొడవు, 50 ఫీట్ల ఎత్తు, దక్షిణ భాగంలో 215 మీటర్ల పొడవు, 100 ఫీట్ల ఎత్తు, ఉత్తర భాగంలో 215 మీటర్ల పొడవు, 20 ఫీట్ల ఎత్తుతో ప్రహరీ నిర్మిస్తున్నాయి. ఉత్తర భాగంలో ప్రహరీ పక్కనే 330 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పులో గార్డెన్‌ నిర్మించి, పూల మొక్కలు, పచ్చని గడ్డి నాటాలని వైటీడీఏ అధికారులు యోచిస్తున్నారు. ఇందులో శంకు, చక్ర, నామాలను అమర్చనున్నట్టు తెలుస్తున్నది. మిగతా 13.02 ఎకరాల్లో శివాలయం, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్‌, విష్ణు పుష్కరిణి నిర్మించగా, ఎస్కలేటర్‌, బస్టాండ్‌, అంబులెన్స్‌, మెట్ల నిర్మాణం, వీవీఐపీ అతిథిగృహం, ఈవో కార్యాలయం, అర్చకుల విశ్రాంతి గది, షాపింగ్‌, క్లాక్‌ రూంలు, పోలీస్‌ ఔట్‌ పోస్టు గదులు, సెక్యూరిటీ రూం, బస్సు, ఫైర్‌ వాహనం పార్కింగ్‌, జీఎల్‌ఆర్‌ పంపుహౌస్‌, కారు పార్కింగ్‌, వీవీఐపీ పార్కింగ్‌ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నారు. గతంలో కేవలం 1.30 ఎకరాల్లో ఉన్న యాదాద్రీశుడి ఆలయం ప్రస్తుతం 4.30 ఎకరాలు వరకు పెరిగింది. శివాలయంతో పాటు పుష్కరిణి, ప్రసాదవిక్రయశాల నిర్మాణం, భక్తుల మౌలిక వసతుల ఏర్పాటుతో యాదాద్రిపై నిర్మాణాలు మరింత విస్తరించనున్నాయి. పూర్తి ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా చేపడుతున్న నిర్మాణాలు భక్తులకు ఆకట్టుకోనున్నాయి. యాదాద్రి దివ్య క్షేత్రం పునర్నిర్మాణం పూర్తయినట్టయితే అశేష భక్త జనసందోహంతో కిటకిటలాడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *