పల్లె ప్రగతికి ..ప్రతి నెలా రూ. 339 కోట్లు : సీఎం కేసీఆర్

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ :  పల్లె ప్రగతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. పల్లెలను అభివృద్ధి చేయడంలో భాగంగానే పల్లె ప్రగతిపై ను చేపట్టినట్లు సీఎం తెలిపారు. పల్లె ప్రగతిపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు జనవరి 1 నుంచి ఫ్లయింగ్ స్కాడ్స్ రంగంలోకి దిగనున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమాల పురోగతిని, వాటి నాణ్యతను ఈ స్కాడ్స్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రభుత్వానికి నివేదిక అందిస్తాయని సీఎం తెలిపారు. 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం జనాదరణ పొందిందన్న సీఎం.. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడం సంతోషకరమన్నారు. ప్రజలు చూపిస్తున్న ఉత్సాహాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు చూపట్లేదని ఫిర్యాదులు, సూచనలు అందుతున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ తనిఖీల ద్వారా దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. పరిస్థితులను బట్టి పల్లెప్రగతి పురోగతిని తనిఖీ చేస్తామని కార్యక్రమం ప్రారంభంలోనే చెప్పినట్లు ఆయన అన్నారు. ఫ్లయింగ్ స్కాడ్స్ ఏర్పాటు చేసి పనితీరు మెరుగుపరుచుకోని అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే అన్ని స్థాయిల్లోని సిబ్బందికి వారు ఊహించని విధంగా పదోన్నతి కల్పించినామని సీఎం గుర్తు చేశారు. గ్రామ కార్యదర్శుల నియామకం చేపట్టడం నుంచి ఎంపీవో, ఎంపీడీవో, డీఎల్పీవో, డీపీవో, జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈవో అన్ని స్థాయిల్లో వ్యవస్థను పటిష్టపరిచామని సీఎం తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం.. ప్రతి నెలా గ్రామాల అభివృద్ధికి రూ. 339 కోట్లు టంచనుగా ప్రభుత్వం విడుదల చేస్తుందని సీఎం పేర్కొన్నారు. పల్లెలను అభివృద్ధిపథంలో నడిపించే విధంగా ఆయా జిల్లా కలెక్టర్లకు నిరంతరం తగు సూచనలు ఇస్తున్నామనీ.. పంచాయతీరాజ్ చట్టంలో కూడా కలెక్టర్లకు అధికారాలను దాఖలు పరిచామని సీఎం తెలిపారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత మెరుగుపర్చేందుకు పని వ్యవస్థలను పటిష్టం చేశామని సీఎం పేర్కొన్నారు. గ్రామ ఉద్యోగుల జీతాలు కూడా పెంచామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇన్ని చర్యలు తీసుకున్నా పల్లెల్లో ప్రగతి ముందుకు పోకపోతే కలెక్టర్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులదే బాధ్యత అని సీఎం అన్నారు. పల్లెలను బాగు చేసుకోవడం కన్నా మించిన పని ప్రభుత్వానికి లేదని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అధికారుల మీద ప్రజా ప్రతినిధుల మీద విశ్వాసంతోనే వారికి కవాల్సినంత వెసులుబాటు, సమయాన్ని ఇచ్చినట్లు సీఎం తెలిపారు. తనిఖీల కోసం ఆత్రపడలేదనీ.. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనదని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. జనవరి 1 నుంచి పల్లె ప్రగతి తనిఖీ కార్యక్రమం ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదనీ.. తనిఖీల ద్వారా నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయడమేనని సీఎం తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ క్యాడర్ల నుంచి ఉన్నతాధికారులను నియమించి తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ప్రతి అధికారికి రాండమ్ పద్దతిలో వివిధ జిల్లాల్లోని 12 మండలాల చొప్పున ఆకస్మిక తనిఖీ కోసం బాధ్యతలను అప్పగిస్తామని సీఎం తెలిపారు. ఎవరికీ ఏ మండలాన్ని అప్పగిస్తామనేది ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందనీ, విడతల వారీగా నిర్వహించే తనిఖీల ద్వారా పల్లె పురోగతి క్రాస్ చెక్ అవుతుందనీ.. తద్వారా ప్రభుత్వానికి సరైన సూచనలు, సలహాలు అందుతాయని సీఎం తెలిపారు.  ఈ కార్యక్రమంలో అలసత్వం వహించినట్లు తేలితే అధికారులు, సర్పంచుల మీద తగు చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీల ద్వారా పల్లె ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రదర్శించిన చిత్తశుద్ధి, శక్తి సామర్థ్యాలను ప్రభుత్వం అంచనా వేస్తుందని సీఎం అన్నారు. ఇది పంచాయతీరాజ్ అధికారులకు, ప్రజాప్రతినిధుల పనితీరుకు ఓ పరీక్షలాంటిదని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అద్దంలా తీర్చిదిద్దే వరకు ప్రభుత్వం విశ్రమించదని సీఎం అన్నారు.

 

 

tags : cm kcr, pragathuibhavan, panchayaties, progress ,riview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *