పదవులు అలంకారం కాదు.. బాధ్యత: రాజశేఖర్‌

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌: పదవులు అలంకారం కోసం కాదని, అవి బాధ్యతలని ప్రముఖ నటుడు రాజశేఖర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఇన్ ఫార్మల్ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి రాజశేఖర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మా’ అసోసియేషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పదవుల విషయంలో ఎంత బాధ్యతగా మెలగాలో అర్థమైంది. అసోసియేషన్‌ విషయంలోనే ఇలా ఉంటే ఇక రాష్ట్రాలను పాలించేవారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు’ అని అన్నారు.

అనంతరం ‘మా’ ప్రధాన కార్యదర్శి, సినీ నటి జీవిత మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమానికి రాగానే నా ‘తలంబ్రాలు’ సినిమాకు రివ్యూ రాసిన గుడిపూడి శ్రీహరిని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. పాతతరం జర్నలిస్టులను, నేటి తరం జర్నలిస్టులను ఒకే వేదికపై చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అసోసియేషన్ల బాధ్యతలు  చూసుకోవడం ఒకవిధంగా గర్వకారణం. ఈ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం’ అని చెప్పారు.

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ. జనార్ధన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరిల ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. పాత, కొత్త సభ్యులందరికీ రాజశేఖర్, జీవిత, దర్శకుడు శంకర్‌ చేతుల మీదుగా గుర్తింపు కార్డులను అందజేశారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఈ అసోసియేషన్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 14న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. దీని కోసం వివిధ కమిటీలను కూడా ప్రకటించారు. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో సినీ ప్రముఖులను సత్కరించనున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *