పంచాయతీ సిబ్బందికి జీవితబీమా

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : గ్రామపంచాయతీల్లో పనిచేసే సిబ్బంది కోసం పూర్తి ప్రభుత్వ ఖర్చుతో ఎస్కే డే జీవితబీమా పథకాన్ని అమలుచేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పంచాయతీ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా సొమ్ము అందేలా పథకం ఉంటుందని వివరించారు. రైతులకోసం అమలుచేస్తున్న రైతుబీమా మాదిరిగానే.. దేశంలో పంచాయతీరాజ్ ఉద్యమానికి ఆద్యుడైన ఎస్కే డే కు నివాళిగా ఈ జీవితబీమాకు ఆయన పేరు పెడుతున్నట్లు చెప్పారు. 30 రోజుల పల్లె ప్రణాళిక కార్యాచరణలో గుర్తించిన పనుల నిర్వహణకోసం జిల్లాలకు రూ.64 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం తదితర పనుల నిర్వహణలో అత్యవసరమైనచోట ఖర్చు పెట్టడానికి వీలుగా ప్రతి జిల్లా కలెక్టర్ కు రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు ఉంటాయని, వీటిని కలెక్టర్లు తమ విచక్షణతో వినియోగించాలని సీఎం చెప్పారు. ఈ మేరకు 32 జిల్లాలకు (హైదరాబాద్ జిల్లా మినహా) రాష్ట్ర ప్రత్యేక నిధుల నుంచి రూ.64 కోట్లు విడుదలచేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువారం ప్రగతిభవన్‌లో మంత్రులు, కలెక్టర్లు, డీపీవోలు, డీఎల్పీవోలు, ముఖ్య కార్యదర్శుల సమావేశం జరిగింది. దాదాపు పదిగంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత పెంచడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ (పల్లె ప్రగతి) దిగ్విజయంగా అమలైందని తెలిపారు. అన్ని గ్రామాల్లో పవర్‌వీక్ నిర్వహించి, విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్‌శాఖ అద్భుతంగా పనిచేసి, అన్ని శాఖల్లోకెల్లా నంబర్‌వన్‌గా నిలిచిందని చెప్పారు.  పల్లె ప్రగతిని విజయవంతం చేసిన మంత్రులు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో), డివిజన్ లెవల్ పంచాయతీరాజ్ అధికారులు (డీఎల్పీవో), మండల పంచాయతీ అధికారులు (ఎంపీవో), గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు సీఎం అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని ఇకముందుకూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి నెలకు రూ.339 కోట్లు విడుదలచేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లా కలెక్టర్ 30 రోజుల కార్యక్రమం అమలులో తమ అనుభవాలను సీఎంకు వివరించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు సమిష్టి ప్రణాళిక, కార్యాచరణ, అభివృద్ధి అనే ఆశయాలతో కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పీసీసీఎఫ్ శోభ, డిస్కమ్‌ల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు పాల్గొన్నారు.  కలెక్టర్ల అనుభవాల అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని, మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో కలిగిందని అన్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగించడానికి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశంతో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు అన్ని ఖాళీలను భర్తీచేసినట్లు వెల్లడించారు. గ్రామపంచాయతీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల కొరత రానివ్వబోమని చెప్పారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు 339 కోట్ల రూపాయల ఆర్థిక సంఘ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నదని, ఇది క్రమం తప్పకుండా కొనసాగుతుందని సీఎం తెలిపారు. గ్రామ పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయానికి ఇది అదనమని అన్నారు. చెట్లు పెంచే పనులకు, చెత్త ఎత్తివేసే పనులకు నరేగా నిధులను వాడుకోవాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని ఇచ్చామని, అవసరమైన నిధులను విడుదలచేశామని, ఇప్పటికైనా గ్రామాల్లో మార్పు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎంచెప్పారు. జిల్లా పంచాయతీ అధికారులు బాధ్యత తీసుకుని, నిధులను సక్రమంగా వినియోగించుకొని, గ్రామాల్లో మార్పు తీసుకురావాలని కోరారు. గ్రామస్థాయిలో రూపొందించిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా పనులు జరుగాలన్నారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణలాంటి పనుల్లో చురుకైన పాత్ర పోషించి కేంద్రప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణలో పచ్చదనం పెంచే లక్ష్యంతో చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరింత వ్యూహాత్మకంగా ముందుకు తీసుకుపోవాలని సీఎం సూచించారు. అడువులు తక్కువున్న కరీంనగర్, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, వరంగల్ అర్బన్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట తదితర జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో ప్రతి ఇంట్లో నరేగా నిధులతో సోక్ పిట్స్ నిర్మించాలని సిఎం ఆదేశించారు. సోక్‌పిట్స్ వల్ల ఏ ఇంటిలోని వ్యర్థం, మురికినీరు అక్కడే అంతర్థానమై, గ్రామంలో దోమలు, ఈగలు వ్యాపించకుండా ఉంటాయని, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు తగ్గుతాయన్నారు. ఇందువల్ల దీనిని అతి ముఖ్యమైనదిగా భావించాలని, సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలను ఆదర్శంగా తీసుకొని సోక్‌పిట్స్ నిర్మించాలని కోరారు. సోక్‌పిట్స్ నిర్మాణం కోసం అవసరమయ్యే నిధులను విడుదలచేయాలని అధికారులను కోరారు.  ఇకపై పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏటా మూడుసార్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. ప్రతి ఏడాది జూన్, సెప్టెంబర్, జనవరి మాసాల్లో పదిరోజుల చొప్పున పల్లె ప్రగతి నిర్వహించాలని పేర్కొన్నారు. పల్లె ప్రగతి మాదిరిగానే 20 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని, దీనికోసం మార్గదర్శకాలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.

 

tags : panchayati workers, insurence, cm kcr, cs Joshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *