నోరా.. తాటిమట్టా… ఐరాసలో ఇమ్రాన్‌కు భారత్ ఘాటు రిప్లై

న్యూయార్క్: ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశం (యూఎన్ఎస్ఏ) వేదికగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిన్న చేసిన ప్రసంగంపై భారత్ ఘాటుగా స్పందించింది. అణు విధ్వంసానికి దిగుతామంటూ బెదిరింపులకు దిగడం రాజనీతిజ్ఞత కాదనీ.. అది బెదిరించి తప్పుకునే వైఖరి అంటూ కౌంటర్ ఇచ్చింది. ఐరాస నిబంధనల ప్రకారం సమాధానం చెప్పే హక్కును వినియోగించుకున్న భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విదిశ మిత్ర… ఇమ్రాన్ ప్రసంగం మొత్తం విద్వేషాన్ని రెచ్చగొట్టేలా, విభేదాలను నూరిపోసేలా సాగిందని దుయ్యబట్టారు. శత్రుత్వాన్ని పెంచుకునే వాళ్లు శాంతిని ఎప్పుడూ స్వాగతించబోరనీ… ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కడమే దీనికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

‘‘అత్యున్నతమైన ఈ సమావేశం వేదికగా వెలువడే ప్రతి మాట చరిత్రకు ప్రాధాన్యం ఇస్తుంది. దురదృష్ట వశాత్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ ప్రపంచాన్ని రెండుగా విభజించి మాట్లాడడం విన్నాం. మేము-వాళ్లు, ధనికులు-పేదలు, దక్షిణం-ఉత్తరం, అభివృద్ధిచెందిన దేశాలు-వర్థమాన దేశాలు, ముస్లింలు-ఇతరులు… ఇలా ఐక్య రాజ్య సమితి దేశాల మధ్య చీలిక తెచ్చేలా ఆయన మాట్లాడారు. విభేధాలు నూరిపోసే ప్రయత్నం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ద్వేషపూరిత ప్రసంగం చేశారు..’’ అంటూ మిత్ర పాక్ ప్రధానికి కౌంటర్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *