నోబెల్‌ త్రయం’

స్టాక్‌హోం, అక్టోబర్‌ 9 : ఈ ఏడాది నోబెల్‌ బహుమతుల్లో ‘త్రయం’ పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే వైద్యం విభాగంలో ముగ్గురిని సంయుక్తంగా నోబెల్‌ వరించగా.. మంగళ, బుధవారాల్లో ప్రకటించిన భౌతికశాస్త్ర, రసాయన శాస్త్ర నోబెల్‌ బహుమతులకు కూడా ముగ్గురు చొప్పున ఎంపిక కావడం విశేషం. లిథియం అయాన్‌ బ్యాటరీలను అభివృద్ధి పరిచిన అమెరికా, బ్రిటన్‌, జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తల త్రయానికి బుధవారం రసాయన నోబెల్‌ ప్రకటించగా, కృష్ణ పదార్థం, విశ్వం పుట్టుకపై అన్వేషణ జరిపిన ముగ్గురు పరిశోధకులను మంగళవారం భౌతిక శాస్త్ర పురస్కారం వరించింది. ఒక్కో విభాగంలో విజేతలకు సంయుక్తంగా రూ. 6,48,72,978 (9,14,000 డాలర్లు) నగదు బహుమతి ఇవ్వనున్నారు. విజేతలు ఈ పురస్కారాన్ని ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి సందర్భంగా డిసెంబర్‌ 10న స్టాక్‌హోమ్‌లో అందుకోనున్నారు. ముగ్గురు ఖగోళ శాస్త్రవేత్తలు.. కెనడియన్‌-అమెరికన్‌ జేమ్స్‌ పీబుల్స్‌ (84), స్వీడన్‌కు చెందిన మైఖేల్‌ మేయర్‌(77), డిడియర్‌ క్వెలోజ్‌(53)కు భౌతిక శాస్త్ర నోబెల్‌ బహుమతి అందించనున్నట్టు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ మంగళవారం ప్రకటించింది. వారు విశ్వం పుట్టుక, వ్యాప్తిపై మన అవగాహనను పెంచారని అభినందించింది. నగదు బహుమతిలో సగం పీబుల్స్‌కు, మరో సగాన్ని మిగతా ఇద్దరికి అందిస్తామని తెలిపింది. బిగ్‌బ్యాంగ్‌ అనంతరం విశ్వం ఎలా వ్యాప్తిచెందిందో పీబుల్స్‌ మనకు వివరించారని, మన పాలపుంతలో సూర్యుడి వంటి మరో నక్షత్రం చుట్టూ తిరుగుతున్న సౌరకుటుంబేతర గ్రహాలను (ఎక్సోప్లానెట్స్‌) మొదటిసారిగా 1995లో మైఖేల్‌, క్వెలోజ్‌ గుర్తించారని నోబెల్‌ కమిటీ పేర్కొన్నది. వీరి పరిశోధనలు విశ్వంపై మనకున్న అవగాహన స్థాయిని పూర్తిగా మార్చివేశాయని కొనియాడింది. విశ్వంపుట్టుకకు కారణమైన ‘బిగ్‌ బ్యాంగ్‌’ అనంతర పరిస్థితులపై పీబుల్స్‌ దీర్ఘకాలం పరిశోధనలు చేశారు. ఐన్‌స్టీన్‌ ఆలోచనలకు సిద్ధాంత రూపం ఇచ్చారు. బిగ్‌బ్యాంగ్‌ అనంతరం అంతరిక్షంలోకి వెలువడిన రేడియేషన్‌ ఉష్ణోగ్రత, అది సృష్టించిన పదార్థ పరిమాణం మధ్య సంబంధాన్ని గుర్తించారు.మొత్తం విశ్వంతో పోల్చితే మనకు తెలిసిన గ్రహాలు, నక్షత్రాలు వంటి పదార్థాల పరిమాణం కేవలం ఐదు శాతం మాత్రమేనని, మిగతాభాగం మనకు తెలియని కృష్ణ పదార్థం (డార్క్‌ మ్యాటర్‌), కృష్ణ శక్తితో (డార్క్‌ ఎనర్జీ) నిండి ఉన్నదని పీబుల్స్‌ సిద్ధాంతీకరించారు. పీబుల్స్‌ ప్రస్తుతం అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో, మైఖేల్‌, క్వెలోజ్‌.. యూనివర్సిటీ ఆఫ్‌ జెనీవాలో పనిచేస్తున్నారు. సూర్యుడి నుంచి 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక నక్షత్రం చుట్టూ గురుగ్రహం పరిమాణంలో ఉన్న ఒక గ్రహం తిరుగుతున్నదని, ఇది పూర్తిగా వాయువులతో నిండి ఉన్నదని వీరిద్దరూ గుర్తించారు. దీన్ని ‘51 పెగసస్‌ బీ’ అని పిలుస్తున్నారు. వీరి పరిశోధన ఖగోళ శాస్త్రంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలికిందని నోబెల్‌ కమిటీ ప్రశంసించింది. వీరి స్ఫూర్తితో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు మన నక్షత్ర మండలంలో నాలుగువేలకు పైగా సౌరకుటుంబేతర గ్రహాలను గుర్తించారని కొనియాడింది.
జీవనశైలినే మార్చేశారు :  లిథియం అయాన్‌ బ్యాటరీలను అభివృద్ధి పరిచి స్మార్ట్‌ఫోన్‌ విప్లవానికి నాంది పలుకడంతోపాటు, శిలాజ ఇంధన వినియోగ రహిత సమాజం దిశగా బాటలు వేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ బుధవారం ‘రసాయనశాస్త్ర నోబెల్‌’ బహుమతిని ప్రకటించింది. అమెరికాకు చెందిన జాన్‌ గుడ్‌ఇనఫ్‌ (97), బ్రిటన్‌కు చెందిన స్టాన్లీ విట్టింగమ్‌(77), జపాన్‌కు చెందిన అకిరా యోషినో(71) సంయుక్తంగా ఈ బహుమతిని అందుకోనున్నారు. వీరిలో జాన్‌ గుడ్‌ఎనఫ్‌.. నోబెల్‌ను అందుకోనున్న అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సాధించనున్నారు. ‘తేలికైన, శక్తివంతమైన, రీచార్జ్‌ చేసుకోగలిగే లిథియం అయాన్‌ బ్యాటరీలను ఇప్పుడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విద్యుత్‌ వాహనాలు వంటివాటిలో విరివిగా వినియోగిస్తున్నాం. అంతేకాదు.. సౌర, పవనశక్తిని విద్యుత్‌శక్తిగా మార్చి నిల్వ చేసుకునే అవకాశం ఈ బ్యాటరీలు కల్పించాయి. తద్వారా శిలాజ ఇంధన వినియోగం లేని సమాజానికి బాటలు పడ్డాయి’ అని కమిటీ పేర్కొన్నది. లిథియం అయాన్‌ బ్యాటరీలు 1991లో మార్కెట్‌లోకి వచ్చాయని, అవి మన జీవనశైలిని మార్చేశాయని పేర్కొన్నది. వీటిని అభివృద్ధి పరుచడం ద్వారా ముగ్గురు శాస్త్రవేత్తలు మానవజాతికి అత్యంత మేలు చేశారని ప్రశంసించింది. 1970ల్లో ప్రపంచం తీవ్ర విద్యుత్‌ కొరతతో అల్లాడుతున్న సమయంలో బ్రిటన్‌ శాస్త్రవేత్త విట్టింగమ్‌ ప్రత్యామ్నాయ విధానాలపై పరిశోధనలు చేశారు.
‘లిథియం’ అనే లోహంలో శక్తిని నిల్వ చేసుకోవచ్చని గుర్తించారు. తర్వాత లిథియంతో బ్యాటరీ వంటిదానిని రూపొందించారు. ఎలక్ట్రాన్ల ద్వారా శక్తిని బదిలీ చేయడాన్ని గుర్తించారు. అయితే శక్తి ప్రవాహం అస్థిరంగా ఉండేది. ఆ తర్వాత అమెరికా శాస్త్రవేత్త గుడ్‌ఇనఫ్‌.. విట్టింగమ్‌ నమూనాపై పరిశోధనలు చేసి, దానికి ప్రత్యేకమైన మిశ్రమాన్ని కలిపి నాలుగు వోల్టుల విద్యుత్‌ను నిలువ చేయగలిగేలా అభివృద్ధి చేశారు. ఇది ఆధునిక బ్యాటరీల ఆవిష్కరణకు బాటలు వేసింది. 1985లో జపాన్‌కు చెందిన యోషినో ఈ బ్యాటరీల్లో లిథియం అయాన్లను నిల్వ చేయగలిగే కార్బన్‌తో తయారైన లోహాన్ని అమర్చి విజయం సాధించారు. యోషినో ప్రస్తుతం జపాన్‌ రాజధాని టోక్యోలోని అసాహి కసెయ్‌ కార్పొరేషన్‌లో, నగోయాలోని మెయిజో యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. గుడ్‌ఇనఫ్‌ ప్రస్తుతం అమెరికాలోని ఆస్టిన్‌లో ఉన్న టెక్సాస్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. విట్టింగమ్‌.. బింగ్‌హామ్టన్‌ యూనివర్సిటీ, న్యూయార్క్‌ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నారు.

 

 

tags : stackhome, noble prize winners

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *