‘నేను నిద్రపోను.. మా దౌత్యవేత్తలను నిద్రపోనివ్వను

అక్షిత ప్రతినిధి, దిల్లీ  : ‘చాలా మంది దౌత్యవేత్తలు నిద్రపోయే సమయంలో కూడా సెల్‌ఫోన్లను స్విచాఫ్‌ చేసేవారు కాదు..’ ఇది సుష్మాస్వరాజ్‌ విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు సరదాగా జరిగిన ప్రచారం. ఎవరైనా సహాయం కోసం సుష్మాను ఆశ్రయించిందే తడవు.. వెంటనే ఆమె సంబంధింత అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడేవారు. ‘నేను నిద్రపోను.. మా దౌత్యవేత్తలను నిద్రపోనివ్వను..’ అని ఆమె ఒక ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో సరదాగా వ్యాఖ్యానించారు. సరదాగా అన్నా.. ఈ వ్యాఖ్యలు ఆమె పనితీరుకు అద్దం పడతాయి. ఇలా విదేశాంగశాఖపై ఆమె చెరగని ముద్రవేశారు. ఆమె తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి జయశంకర్‌ కూడా సుష్మా నెలకొల్పిన విధానాలను కొనసాగిస్తామని చెప్పారు.
విదేశాంగ శాఖ అంటే వ్యూహాలు.. ప్రతి వ్యూహాలకే పరిమితమయ్యేది. ఇటువంటి శాఖను ఆమె ప్రజలకు చేరువ చేశారు. ‘ప్రజల పాలసీని విదేశాంగ విధానానికి అనుసంధానించడానికి కృషి చేస్తున్నాం’ అని ఆమె స్వయంగా ఒక సందర్భంలో వెల్లడించారు. బధిర యువతి గీతాను పాకిస్థాన్‌ నుంచి తీసుకొచ్చినా.. ప్రత్యక్ష నరకం చూపించే ఒక వివాహ బంధంలో ఇరుక్కున్న ఉజ్మాను రక్షించినా.. నమ్మిన భర్త చేతిలో మోసపోయి దిక్కులేకుండా శరణార్థ శిబిరంలో తలదాచుకొన్న గురుప్రీత్‌ను అక్కున చేర్చుకొన్నా.. అది చిన్నమ్మకే చెల్లింది. వీరంతా భరతమాత కూతుళ్లని సుష్మా చెబుతారు. ప్రజల మనిషిగా ఉండటంతో సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్‌ ఉన్న నేతల్లో ఒకరిగా ఆమె నిలిచారు. విదేశీ వ్యవహారాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు. ఈ విషయంలో మోదీ నమ్మకాన్ని ఆమె నిలబెట్టుకొన్నారు. న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ నిర్వహించిన కార్యక్రమంతో ప్రవాస భారతీయుల్లో మోదీ ఇమేజ్‌ పెరిగిపోయింది. ఈ కార్యక్రమం వెనుక గ్రౌండ్‌ వర్క్‌, ఆలోచన సుష్మాదే కావడం విశేషం. ప్రవాస భారతీయులను ఆమె దేశ సంపదతో పోలుస్తారు. ‘‘ప్రవాస భారతీయులు దేశానికి అతిపెద్ద ఆస్తి. ఆర్థిక వ్యవస్థలో, దేశ ప్రతిష్ఠ, పలుకుబడిలో అత్యంత కీలకమైనవారు’’ అని 2016లో జరిగిన ఒక పుస్తకావిష్కరణలో ఆమె పేర్కొన్నారు.

విజయవంతమైన మోదీ 1.0 విదేశాంగ విధానం..

మోదీ సర్కారు హయాంలో భారత్‌ చాలా చిన్న దేశాలతో సన్నిహిత సంబంధాలును పెట్టుకొంది. ఇవన్నీ ఐరాసలో భారత్‌కు బలమైన ఓటు బ్యాంక్‌గా పనిచేస్తాయన్న విషయాన్ని సుష్మా నేతృత్వంలోని విదేశాంగ శాఖ గుర్తెరిగి పనిచేసింది.  యెమన్‌ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను రక్షించడంలో సుష్మా పాత్ర కీలకం. తమ దేశ ప్రజలు ఎక్కడ ఉన్నా రక్షించేందుకు వాయుసేన విమానాలను సైతం వినియోగించగలమని ప్రపంచానికి తెలియజెప్పింది. బంగ్లాదేశ్‌తో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడంలో సుష్మా నేతృత్వంలోని విదేశాంగశాఖ చొరవ చూపింది.  మెడికల్‌ వీసాల విషయంలో మానవీయ కోణంతో మోదీ సర్కారు పనిచేస్తోందనడానికి సుష్మా స్వరాజ్‌ పనితీరే కారణం. ఇది ప్రజల మనసులు గెలుచుకొంది. పాకిస్థాన్‌ లాహోర్‌కి చెందిన ఓ సివిల్‌ ఇంజినీర్.. తమ నెలల పసికందుకి భారత్‌లో చికిత్స కోసం వీసా వచ్చేలా సాయం చేయాలని ట్విటర్‌‌లో కోరాడు. ఎప్పటిలాగే వెంటనే స్పందించిన సుష్మా..”నీ బిడ్డకు ఎలాంటి కష్టం రాదు”అని భరోసా ఇచ్చి ఆ పసికందు ప్రాణం కాపాడారు.  విదేశాంగ శాఖ హెడ్‌పోస్టాఫిస్‌ల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని సుష్మా ప్రారంభించారు. 2019 మార్చినాటికి దేశవ్యాప్తంగా 500  పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించారు. మన దేశ యువతులకు రంగుల కలలు చూపించి విదేశాలకు తీసుకెళ్లి మోసం చేసే ఎన్నారైల భరతం పట్టడానికి ఉద్దేశించిన బిల్లును సుష్మా స్వరాజ్‌ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.  గతంలో పాకిస్థాన్‌కు రాయితీపై ఎఫ్‌16 యుద్ధవిమానాలు విక్రయించకుండా విదేశాంగ శాఖ చేసిన లాబీయింగ్‌ ఫలించింది. ఇప్పటి వరకు దేశం నుంచి పరారైన నేరగాళ్లను అత్యధికంగా మోదీ 1.0 సమయంలో భారత్‌కు పట్టితెచ్చారు. ఈ కాలంలో 22 మందిని భారత్‌కు తీసుకొచ్చారు. రాజీవ్‌ సక్సేనా.. క్రిస్టియన్‌ మిషెల్‌ వంటి వారు వీరిలో ఉన్నారు.  పుల్వామా దాడి అనంతరం మసూద్‌ అజహర్‌ నిషేధానికి చైనాను ఒప్పించడంలో విదేశాంగశాఖ కృషి చాలా ఉంది. ఒక దశలో సుష్మా స్వరాజే స్వయంగా రంగంలోకి దిగి చైనా నాయకులతో మాట్లాడారు. మోదీ 1.0లో ఆమె నేతృత్వంలోనే విదేశాంగ శాఖ విధానాలు అత్యంత విజయవంతమయ్యాయి.

 

tags : sushmaswaraj, bjp, modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *