నిరంతరం ‘జ్వలించే దీపం’
రూ. 100కోట్లపైగా ఖర్చుతో.. అమరుల త్యాగాలకు గుర్తుగా స్మారక చిహ్నం
లుంబినీ పార్కు వద్ద 3.29 ఎకరాల్లో నిర్మాణం
ముమ్మరంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు
వచ్చే ఏడాది జూన్ 2న ఆవిష్కృతం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
అమరుల త్యాగానికి చిహ్నం.. అరవై ఏండ్ల పోరాటానికి ఆనవాళ్లు.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన పోరుకు గుర్తు. భావి తెలంగాణ సమాజం స్మరించుకునేలా… సీఎం కేసీఆర్ సంకల్పానికి ప్రతిరూపంగా అద్భుతమైన వేదిక సిద్ధమవుతున్నది. నగర నడిబొడ్డున త్యాగధనుల కోసం ‘జ్వలించే దీపం’ రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసుకున్న ఈ అమరుల స్మృతి చిహ్నం ప్రపంచంలోనే అరుదైన కట్టడంగా ఖ్యాతికెక్కనున్నది. వచ్చే ఏడాది జూన్ 2 నాటికి పూర్తి చేసేలా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
సుమారు రూ. 100కోట్లకు పైగా…
సుమారు రూ. 100 కోట్లకు పైగా ఖర్చుతో లుంబినీ పార్కు వద్ద 3.29 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆర్ అండ్ బీ శాఖ నిర్మిస్తున్నది. అమరుల స్ఫూర్తి నిత్యం జ్వలించేలా దీపాకృతి ఆకారంతో ఈ కట్టడం శరవేగంగా రూపుదిద్దుకుంటున్నది. భవిష్యత్తరాలకు నిరంతరం జ్ఞాపకంగా నిలువనున్నది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తవ్వగా, 2021 జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతులు మీదుగా ఆవిష్కృతమయ్యేలా పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
1700 టన్నుల ఇనుము..
ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో ఈ చిహ్నం నిర్మాణాన్ని 2018 సెప్టెంబరులో ప్రారంభించారు. ఆరు అంతస్తులతో నిర్మితమవుతున్న ఈ స్మృతి చిహ్నం నిర్మాణంలో ఒక్కొక్కటి 18 నుంచి 20 టన్నుల బరువు ఉండే 26 స్టీల్ పిల్లర్లను వినియోగించారు. 1700 టన్నుల వరకు ఐరన్, 300 టన్నుల మేర సీమ్‌లెస్ స్టీల్‌ను ఉపయోగిస్తున్నారు.
శాశ్వతంగా…
గుండ్రని ఆకారంలో భవనం, దీపాకృతిని నిర్మిస్తుండగా, ప్రపంచంలోనే అరుదైన నిర్మాణంగా ఇది ఖ్యాతికెక్కనున్నది. ఆర్ అండ్ బీఈఎన్సీ గణపతిరెడ్డి నేతృత్వంలో ఈఈ ,డీఈ, ఏఈల పర్యవేక్షణలో పది మంది సైట్ ఇంజినీర్లు, 150 మంది వర్కర్లు, వందలాది మంది కార్మికులు నిత్యం ఈ నిర్మాణంలో నిమగ్నమయ్యారు. కట్టడంలో సీమ్‌లెస్ స్టీల్‌ను వినియోగిస్తున్నారు. ఎక్కువ కాలం పాటు తుప్పు పట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 75 శాతం మేర పనులు పూర్తయ్యాయి.
ప్రాజెక్టు విశేషాలు..
లుంబినీ పార్కు పక్కన 3.29 ఎకరాల్లో (15, 950 చదరపు గజాలు) నిర్మాణం.
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.100కోట్లకు పైగా..
నిర్మాణ పరిధి 27,640 చదరపు మీటర్లు (2, 35, 477 చదరపు అడుగులు).
రెండు బెస్మెంట్ ఫ్లోర్లు, ఆరు అంతస్తులు..
ఎలిఫ్టికల్ ఆకారంలో మేజర్ యాక్సిస్ 44 మీటర్లు, మైనర్ యాక్సిస్ 28 మీటర్ల ఔటర్ డైమెన్షన్‌తో ఉంటుంది.
నిర్మాణం ఎత్తు 24 మీటర్లు, టెర్రస్ లెవల్ నుంచి దీపం వరకు 27 మీటర్లు ఉంటుంది. మొత్తంగా భూ మట్టం నుంచి 50 మీటర్ల ఎత్తులో స్మారకాన్ని నిర్మిస్తున్నారు.
ముఖద్వారం వద్ద నిర్మాణం కదులుతూ నృత్యం చేసేలా ఫౌంటెన్ నిర్మాణం, పది మీటర్ల ఎత్తులో తెలంగాణ తల్లి స్తూపం ఏర్పాటు. మెమోరియల్ ఫ్లోర్లో ఫొటో గ్యాలరీ, మ్యూజియం, ఆడియో, వీడియోలు 100-150 మంది వరకు వీక్షించే అవకాశం ఉంటుంది. భారీ కన్వెన్షన్ హాల్లో 700 మంది సీటింగ్ సామర్థ్యం ఉంటుంది. హుస్సేన్‌సాగర్ అందాలను వీక్షిస్తూ రెస్టారెంట్ సదుపాయాలను ఆస్వాదించవచ్చు. వెంటిలేషన్‌తో పాటు ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా నిర్మాణం.
చరిత్రలో నిలిచేపోయేలా నిర్మాణం
ప్రపంచస్థాయిలో ఏ దేశంలోనూ లేని అద్భుత నిర్మాణాన్ని చేపట్టాలన్న సీఎం కేసీఆర్ కోరిక మేరకు అమరుల త్యాగానికి ప్రతీకగా ఈ అద్భుత నిర్మాణానికి రూపకల్పన చేశాం. అత్యాధునిక టెక్నాలజీతో చేపడుతున్న ఈ నిర్మాణంలో ప్రతీది అద్భుతమే. వచ్చే ఏడాది జూన్ 2న ఈ స్మారకం ఆవిష్కృతం కానున్నది.
–ఎంవీ రమణారెడ్డి, రూపశిల్పి