నిండుకుండలా శ్రీరాంసాగర్‌

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్:  మూడేండ్ల తర్వాత.. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు కాగా.. సోమవారం ఉదయానికే 1091 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 16 వరద గేట్ల నుంచి 75 వేల క్యూసెక్కులు, తొలిసారి ఎస్కేప్‌ గేట్ల నుంచి 3 వేల క్యూసెక్కులను గోదావరిలోకి వదిలారు. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు నుంచి 38వేల క్యూసెక్కులు సోమవారం శ్రీరాంసాగర్‌లోకి చేరాయి. మంగళవారం మహారాష్ట్రలోని గైక్వాడ్‌ ప్రాజెక్ట్‌ నుంచి మిగులు జలాలను విడుదల చేసే అవకాశం ఉంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జెన్‌కో కేంద్రంలో సోమవారం నాలుగు టర్బయిన్లతో 36.98 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు మూడేండ్ల తర్వాత పూర్తిస్థాయిలో నిండింది. సోమవారం ఉదయానికే పూర్తిస్థా యి నీటి మట్టం 1091 అడుగులకు(90.313 టీఎంసీలు) చేరుకున్నది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి వరదను గోదావరిలోకి వదిలారు. 2016లో ఎస్సారెస్పీ గేట్లు ఎత్తగా.. మూడేండ్ల అనంతరం సోమవారం మరోసారి గేట్లను ఎత్తి నీటిని వదిలారు. ఎగువనుంచి ఎస్సారెస్పీకి 83 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు 16 వరద గేట్ల నుంచి 75 వేల క్యూసెక్కులు, ఎస్కేప్‌ గేట్ల నుంచి 3 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలారు.

16 గేట్ల ద్వారా 75 వేల క్యూసెక్కులు..

ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నదీ పరివాహక మండలాలు మెండోరా, ఎరగట్ట, గుమిరాల, సోన్‌, లకమఛంద, మమడ, ఖానాపూర్‌ పరిధిలోని హెచ్చరికలు జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అనంతరం ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ రామారావు ఉదయం 9గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, 8 గేట్లు పైకి ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. 11:35 గంటలకు మరో నాలుగు వరద గేట్లను ఎత్తారు. మధ్యాహ్నం 2.47 గంటలకు మరో నాలుగు గేట్లు ఎత్తి మొత్తం 16 గేట్ల ద్వారా 75 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ప్రాజెక్టుకు 33వేల ఇన్‌ఫ్లో అదేస్థాయిలో అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు నుంచి 38 వేల క్యూసెక్కుల నీరు శ్రీరాంసాగర్‌లోకి చేరింది. మహారాష్ట్రలోని గైక్వాడ్‌ ప్రాజెక్ట్‌ నుంచి మంగళవారం నీటిని విడుదల చేసే అవకాశం ఉ న్నది. ఇదిలా ఉండగా కాకతీయ కాల్వకు అనుసంధానంగా ఉన్న ఎస్కేప్‌ గేట్ల నుంచి గోదావరిలోకి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎస్కేప్‌కు నూతన గేట్లు, ఆటోమేటిక్‌, మాన్యువల్‌ యంత్రాలు బిగించిన తరువాత తొలిసారిగా వినియోగించారు. జెన్‌కో కేంద్రంలో విద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో చేపట్టాలంటే కాకతీయ కాల్వకు 9 వేల క్యూసెక్కులను నీటిని విడుదల చేయాలని, అందు కోసమే ఎస్కేప్‌ గేట్లతో నీటిని వదులుతున్న ట్టు అధికారులు తెలిపారు. నాలుగు టర్బయిన్లతో 36.98 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసినట్టు డీఈ శ్రీనివాస్‌ తెలిపారు.

ఎల్లంపల్లి 11 గేట్లు ఎత్తివేత..

అంతర్గాం/కాళేశ్వరం/మహదేవపూర్‌: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి సోమవారం 22,946 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, అధికారులు 11 గేట్లను 0.5 మీటర్లు ఎత్తి 30,668 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన సరస్వతి (అన్నారం) బరాజ్‌కు 26,500 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా.. 5 గేట్లు ఎత్తి 22,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సాయంత్రం ఇన్‌ఫ్లో తగ్గడం తో గేట్లు మూసివేశారు. లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌లో 15 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. బరాజ్‌లో ప్రస్తుతం 95.800 మీటర్ల ఎత్తులో 5.812 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.

కృష్ణా బేసిన్‌కు మరోసారి వరద..

కృష్ణా బేసిన్‌లో మరోసారి వరద పొంగుతున్నది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 30,991 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో 30,991 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపుర ప్రాజెక్టుకు 1.90 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో, 2.20 లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. జూరాలకు 44 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా.. 40,488 అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. శ్రీశైలానికి 57,057 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తు న్నది. నాగార్జునసాగర్‌కు 65,184 క్యూసెక్కు ల వరద వస్తున్నది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు 589.30 అడుగుల వద్ద 309.9534 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 2 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మూసీ ప్రాజెక్టులోకి వస్తుండగా రెండు గేట్ల ద్వారా 1660 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర డ్యాంకు 1.08 లక్షల ఇన్‌ఫ్లో వస్తుండగా, 28 స్పిల్‌ వే గేట్లు ఎత్తి 90,901 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు.

 

 

tags : sriramsagar, jalakala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *