నాడు తిట్లు.. నేడు జట్లు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించిదని ఏపీ సీఎం చంద్రబాబు కలత చెందారట! దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను భుజానికెత్తుకున్నారట! ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో కలిసి బీజేపీపై పోరాటానికి సిద్ధమయ్యారట! అందుకే ఏఐసీసీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారట! తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు, తన వాదనను సమర్థించుకొనేందుకు హస్తిన సాక్షిగా ప్రదర్శించిన నవరసాల నాటకమిది! ఒకప్పుడు తాను మొద్దబ్బాయిగా అభివర్ణించిన రాహుల్‌గాంధీతో భేటీ అయిన చంద్రబాబు.. ఒకప్పడు తిట్టిన తిట్లన్నీ మూటకట్టి.. మూలపడేసి.. జట్టుకట్టారని, పైగా దానికి ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ముసుగు తగిలించారని పలువురు ఆరోపిస్తున్నారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో విసిరేస్తామంటూ టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఆశయానికి దేశరాజధాని సాక్షిగా నీళ్లొదిలిన చంద్రబాబు.. ఏకంగా టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశంపైనా చర్చించారన్న వార్తలు గుప్పుమన్నాయి. బీజేపీతో బంధం చెడిపోవడంతో, రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌గూటికి తిరిగి వెళ్లిపోవాలని ఆయన నిర్ణయించుకున్నారని అంటున్నారు. వాస్తవానికి నాలుగు దశాబ్దాలుగా ఓ రాష్ట్రనేతగా చంద్రబాబు తిట్టినంత మరెవరూ కాంగ్రెస్‌ను తిట్టలేదేమో! కానీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ ముద్దొచ్చింది. ఒకప్పుడు దయ్యంగా వర్ణించిన సోనియాగాంధీ.. ఇప్పుడు ఫక్తు రాజకీయప్రయోజనాల దృష్ట్యా దేవతలా కనిపిస్తున్నది. కాంగ్రెస్, టీడీపీల అపవిత్ర పొత్తుపై అప్పుడే ఏపీ కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఈ పొత్తును వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వట్టి వసంత్‌కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ, కాంగ్రెస్ కలయిక రెండు పార్టీల్లోని నాయకులకు ఇష్టం లేదనడానికి ఇదే నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తిట్టిన నోటితోనే పొగడ్తలా?
రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ల నుంచి నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి మీడియా సమావేశం పెట్టేవరకు చంద్రబాబు నరంలేని నాలుక ఎన్నిమాటలు మార్చిందో చెప్పేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని పలువురు గుర్తుచేస్తున్నారు. సోనియా మొద్దు కుమారుడు రాహుల్‌కు కనీస నాయకత్వ లక్షణాలు లేవు అని ఓ రోడ్‌షోలో చంద్రబాబు విమర్శించారు. తాజాగా రాఫెల్ వివాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారంటూ అదే రాహుల్‌ను మెచ్చుకున్నారు. సోనియాగాంధీని ఇటలీ దయ్యం, తెలుగు జాతిని చంపుతున్న గాడ్సే అని కూడా అన్నారు. కాంగ్రెస్ పార్టీది రక్త హస్తంఅంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను గోతితీసి పూడ్చిపెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాంటి చంద్రబాబే ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడంపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Tags: Rahul Gandhi , Chandrababu Naidu , Congress , TDP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *