నవ భారత నిర్మాణo : మోదీ

అక్షిత ప్రతినిధి, దిల్లీ :  నవీన భారత్‌ను ఆవిష్కరించే దిశగా ప్రతి భారతీయుడూ నడుం బిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మార్పును సాకారం చేయాలని కోరారు. అభివృద్ధి పథంలో సమున్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. వీటిని ప్రభుత్వం, 130 కోట్ల మంది ప్రజలు కలసికట్టుగా సాధించాలని ఉద్ఘాటించారు. ఈ దిశగా దేశం సాధించాల్సిన లక్ష్యాలను ఆయన వివరించారు. ‘‘ఈ దేశ ప్రధాని కూడా మీలా ఒక సామాన్యుడే. అందువల్ల మనం అంతా కలిసి పనిచేయాలి. రాబోయే రోజుల్లో గ్రామాల్లో 1.50 లక్షల ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వైద్య వృత్తిని చేపట్టాలనుకున్న యువకుల కలను నెరవేర్చేందుకు మూడు లోక్‌సభ స్థానాలకో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలి. రెండు కోట్ల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. 15 కోట్ల గ్రామీణ ఇళ్లకు తాగునీరు అందించాల్సి ఉంది. 1.25 లక్షల కిలోమీటర్ల గ్రామీణరోడ్లు నిర్మించాల్సి ఉంది. ప్రతి గ్రామాన్నీ బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించాలి. 50వేలకుపైగా కొత్త అంకురపరిశ్రమలకు జీవం పోయాల్సి ఉంది. మన లక్ష్యం హిమాలయం అంత ఉన్నతమైందే. మన ఉత్సాహానికి ఆకాశమూ హద్దు కాదు. మన సామర్థ్యం హిందూ మహాసాగరం కన్నా లోతైంది. మన ప్రయత్నం గంగాధార కంటే పవిత్రమైంది. వేల సంవత్సరాల మనుషులు, రుషుల తపస్సు, జాతి నిర్మాతల త్యాగం ప్రేరణగా తీసుకొని నవభారత నిర్మాణం కోసం సరికొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుదాం’’ అని మోదీ పిలుపునిచ్చారు. భారత 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని గురువారం ఇక్కడ ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అనంతరం జాతినుద్దేశించి గంటన్నరపాటు ప్రసంగించారు. గత అయిదేళ్లలో చేసిన పనులు, వచ్చే అయిదేళ్లలో సాధించబోయే లక్ష్యాలను వివరించారు. ప్రభుత్వ, ప్రజల బాధ్యతలను గుర్తుచేశారు. భారత త్రివిధ దళాలను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు రక్షణ బలగాల అధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎస్‌)ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. జమ్మూ-కశ్మీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి 70 ఏళ్లలో ప్రతి ప్రభుత్వమూ శ్రమించింది. కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. దీంతో కొత్త నిర్ణయాల అవసరం ఏర్పడింది. జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. 130 కోట్లమంది ఆ బాధ్యతను తీసుకున్నారు. గత 70 ఏళ్లలో ఈ వ్యవస్థ వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు బలాన్నిచ్చింది. ఇప్పుడు జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లు అభివృద్ధి, శాంతికి తార్కాణంగా నిలవనున్నాయి. అక్కడి ప్రజలు నేరుగా దిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాతావరణాన్ని నెలకొల్పాం. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ‘370’కి మద్దతుగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. నాకు మాత్రం దేశ భవిష్యత్తే ముఖ్యం. దాని ముందు రాజకీయ భవిత తృణప్రాయం. రాజ్యాంగ నిర్మాతలు, సర్దార్‌ పటేల్‌ లాంటి మహా పురుషులు దేశ ఐక్యత కోసం ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని విజయవంతంగా అమలుచేశారు. ముస్లిం ఆడపడుచుల హక్కులు కాపాడటానికి ముమ్మారు తలాక్‌కు వ్యతిరేక చట్టం తీసుకొచ్చాం. సమస్యలను మూలాల నుంచే పెకలించడానికి ప్రయత్నించాలి. ప్రపంచంలో చాలా ఇస్లామిక్‌ దేశాలు ఈ సంస్కృతిని ఎప్పుడో రద్దు చేశాయి. దేశంలో మాత్రం తటపటాయించాం. ఇక్కడ సతీ సహగమనానికి ముగింపు పలికినప్పుడు, భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా చట్టాలు చేసినప్పుడు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గొంతెత్తినప్పుడు, వరకట్నానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకున్నప్పుడు ముమ్మారు తలాక్‌పై ఎందుకు గొంతెత్తకూడదు? తలాక్‌పై నిర్ణయం.. రాజకీయ తులాభారంతో తూచే నిర్ణయం కాదు. జీఎస్‌టీ రూపంలో ‘ఒకే దేశం.. ఒకే పన్ను’ కలను సాకారంచేశాం. విద్యుత్తు రంగంలో ‘ఒకే దేశం ఒకే గ్రిడ్‌’ కలను నెరవేర్చాం. ‘వన్‌ నేషన్‌.. వన్‌ మొబిలిటీ కార్డ్‌’ వ్యవస్థనూ తెచ్చాం. ఇప్పుడు ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అన్న చర్చ దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది. దీనిపై ప్రజాస్వామ్య బద్ధంగా చర్చ జరగాలి. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా దేశంలోని దాదాపు సగం ఇళ్లకు తాగునీరు అందుబాటులో లేదు. గుక్కెడు నీటికోసం ఆడపడుచులు కుండలు పట్టుకొని కిలోమీటర్ల కొద్దీ నడిచివెళ్లే పరిస్థితి ఉంది. అందుకే ఇంటింటికీ ఎలా నీరందించాలన్న దానిపై దృష్టిపెట్టాం. దీన్ని పరిష్కరించడానికి ‘జల్‌జీవన్‌ మిషన్‌’తో ముందుకెళ్లబోతున్నాం. దీని కోసం రూ.3.50 లక్షల కోట్లు ఖర్చుపెట్టాలని నిర్ణయించాం. ఇప్పటివరకు రాజకీయ ప్రయోజనాల దృష్టితో నిర్ణయాలు జరిగాయి. దీనివల్ల భావితరాలు నష్టపోతూ వచ్చాయి. అందుకు ఉదాహరణ జనాభా పెరుగుదల. దేశంలోని చైతన్యవంతమైన సమాజం దీన్ని బాగా అర్థం చేసుకుంది. పుట్టబోయే బిడ్డకు న్యాయం చేయగలమా? లేదా? అని ఆలోచిస్తున్నారు. ఎంతోమంది కుటుంబాన్ని పరిమితం చేసుకొని తమవారితోపాటు, దేశానికీ బలం చేకూరుస్తున్నారు. అలాంటి వారంతా గౌరవనీయులే. కుటుంబ నియంత్రణ పాటించి గౌరవప్రద జీవితం గడుపుతున్నవారి గురించి దాన్ని పాటించనివారికి తెలియజెప్పి, జనాభా పెరుగుదలను అరికట్టాలి. అక్టోబరు 2 నుంచి ఒకసారి వాడి పారేసే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నుంచి దేశానికి విముక్తి కల్పించాలి. మహాత్ముడి స్ఫూర్తితో ఆ ప్లాస్టిక్‌ను సేకరించే పని మొదలుపెట్టాలి. సంచులను ఇంటి నుంచి తెచ్చుకోవాలంటూ వ్యాపారులంతా తమ దుకాణాల్లో బోర్డులు పెట్టాలి. లేదంటే వస్త్ర సంచులు అమ్ముతాం..  తీసుకెళ్లండి అని చెప్పాలి. దీపావళికి బహుమతులు పంచే వ్యాపారులు ఆ స్థానంలో తమ కంపెనీ పేర్లు ముద్రించిన ఇలాంటి సంచులు బహుమతిగా ఇవ్వండి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం దేశానికి నష్టం చేకూర్చింది. చెదపురుగుల మాదిరి మన జీవితంలోకి అవి చొరబడ్డాయి. వాటిని అంతమొందించడానికి మేం నిరంతరం శ్రమిస్తున్నాం. కొన్ని ఫలితాలు వచ్చాయి. కానీ రోగం బాగా ముదిరిపోయింది. దాన్ని అంతమొందించడానికి ప్రజలూ కలిసిరావాలి. నయం అయినట్లు కనిపించినా అవకాశం వచ్చినప్పుడు మళ్లీ తిరగబెట్టే రోగం ఇది. సాంకేతికతను ఉపయోగించుకొని దీనికి చికిత్స చేస్తున్నాం. ఐదేళ్లలో మన ఆర్థిక వ్యవస్థను 5లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్తాం. అదే కాలంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించడం, ప్రతి ఇంటికీ కరెంటు ఇవ్వడం, ప్రతి గ్రామానికి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుచేయడం మన లక్ష్యాలు. మనం ప్రపంచానికి విపణిగా మారడంకాదు, ప్రపంచ మార్కెట్లో మన వస్తువులను అమ్మేందుకు శ్రమించాలి. చిన్నచిన్న దేశాలకున్న శక్తి మన దేశంలోని ఒక్కో జిల్లాకు ఉంది. దాన్ని సంఘటితం చేసి ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలి. పారదర్శకత, జవాబుదారీతనం, బలమైన ఆర్థిక వ్యవస్థకోసం గ్రామాలు, పట్టణాల్లోని చిన్న దుకాణాల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు చేపట్టాలి. ‘డిజిటల్‌ చెల్లింపులు ముద్దు.. నగదు చెల్లింపులు వద్దు’ అని వ్యాపారులు బోర్డులు పెట్టాలి. దేశంలో మధ్య, ఉన్నత మధ్య తరగతి వర్గం పెరుగుతోంది. కుటుంబంతో సహా వారు ఏటా ఒకటి రెండుసార్లు విదేశాలకు వెళుతున్నారు. అది మంచి అలవాటే. ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ 2022 నాటికి దేశంలోని 15 పర్యాటక ప్రాంతాలను చుట్టి రావాలని కోరుతున్నా. సరైన వసతులు, హోటళ్లు లేకున్నా వెళ్లిచూడండి. దీనివల్ల దేశంలోని యువతకు మెరుగైన ఉపాధి కలుగుతుంది.

 

 

 

 

tags : modi,redfort

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *