కశ్మీర్‌కు….ఇక బంగరు భవిష్యత్తు…

అక్షిత ప్రతినిధి, దిల్లీ : జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రజల బంగరు భవిష్యత్తు కోసమే 370 అధికరణాన్ని రద్దుచేసి,  రాష్ట్రాన్ని కేంద్రపాలిత  ప్రాంతాలుగా మార్చినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఈ రెండు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 370 అధికరణంతో రాష్ట్రంలో వేర్పాటువాదం, అవినీతి, కుటుంబ పాలన మాత్రమే సాధ్యమైందన్నారు. పైగా రాష్ట్రంలో ఉగ్రవాద వ్యాప్తికి ఈ నిబంధనను పాకిస్థాన్‌ ఉపయోగించుకుందని చెప్పారు. ఈ ఇబ్బందులతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిన ఈ ప్రాంతాల్లో సరికొత్త వెలుగులు రావడం ఖాయమన్నారు. ప్రపంచదేశాల నుంచి వచ్చే సినిమా షూటింగ్‌లు, విద్యా, వైద్యకేంద్రాలతో జమ్మూ-కశ్మీర్‌ లద్దాఖ్‌లు కళకళలాడటం ఖాయమని పేర్కొన్నారు. అందుకు స్థానిక ప్రజలతోపాటు, దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. జమ్మూ-కశ్మీర్‌లో చరిత్రాత్మకంగా, భౌగోళికంగా మార్పులు చేపట్టాక తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ అభివృద్ధికి ఒక మార్గసూచీని ఆవిష్కరించారు. ఆకాంక్ష, ఆశావాద సందేశాలతో తన ప్రసంగాన్ని రంగరించారు. ఉపాధి, పెట్టుబడులకు హామీ ఇచ్చారు. త్వరలోనే అక్కడ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరుగుతాయని హామీ ఇచ్చారు. ఇది ప్రజా ప్రభుత్వంగానే కొనసాగుతుందన్నారు. ఒక వ్యవస్థ వల్ల జమ్మూ-కశ్మీర్‌లోని మన సోదర సోదరీమణులు అనేక హక్కులను కోల్పోయారు. వారి అభివృద్ధికి అది ప్రధాన అవరోధంగా ఉండేది. మనందరి ప్రయత్నంతో అది ఇప్పుడు తొలగిపోయింది. సర్దార్‌ పటేల్‌, అంబేడ్కర్‌, శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, అటల్‌తో పాటు కోట్లాది మంది దేశభక్తుల కల ఇప్పుడు నెరవేరింది. జమ్మూ-కశ్మీర్‌ లద్దాఖ్‌లో ఒక కొత్త యుగం మొదలైంది. ఇప్పుడు దేశంలో ప్రజలందరి హక్కులు, బాధ్యతలు సమానమయ్యాయి. సమాజ జీవితంలో కొన్ని మాటలు సమయంతోపాటే మనసులో కలిసిపోతుంటాయి. దానివల్ల మనలో చెరిపేయలేని భావనలు ఏర్పడుతుంటాయి. 370  అధికరణం విషయంలోనూ అదే జరిగింది. దానివల్ల జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రజలకు ఎలా నష్టం జరిగిందన్నదానిపై ఇప్పటివరకూ చర్చే జరగలేదు. ఆందోళనకర విషయం ఏమంటే ఆ అధికరణాన్ని పెట్టిన వాళ్లు కూడా దానివల్ల అక్కడి ప్రజలకు ఏం లాభం జరిగిందో చెప్పలేకపోవడమే. వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, వారసత్వవాదులు, వ్యవస్థలో పెద్దఎత్తున అవినీతిని ప్రోత్సహించడం తప్ప ఈ నిబంధన వల్ల జమ్మూ-కశ్మీర్‌కు ఒరిగిందేమీ లేదు. భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని వర్గాల్లో భావనలు నెలకొల్పడానికి పాకిస్థాన్‌ దీన్నో ఆయుధంలా ఉపయోగించింది. ఫలితంగా మూడు దశాబ్దాల్లో దాదాపు 42 వేల మంది అమాయకులు బలయ్యారు. ఈ గణాంకాలు చూస్తే ఎవరి కళ్లయినా చెమర్చక మానవు. దీనివల్ల జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లలో అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు అవన్నీ దూరం అవడం వల్ల  ప్రజల జీవనం మెరుగుపడుతుంది. భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. మన దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజల మేలు కోసం పార్లమెంటులో చట్టాలు చేస్తుంది. అది నిరంతర ప్రక్రియ. చట్టాలు చేసే సమయంలో పార్లమెంటులో విస్తృత చర్చ, మథనం జరుగుతుంది. ఆ చట్టం వల్ల కలిగే అవకాశాలు, ప్రభావాలపై సంవాదం ఉంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో ముడిపడిన ఈ ప్రక్రియ దేశ ప్రజలకు బలం. అయితే పార్లమెంటు ఇంత పెద్ద సంఖ్యలో చట్టాలు చేసినా అవి దేశంలో ఒక భాగంలో అమలుకాబోవని ఎవరూ ఊహించలేదు. దేశ ప్రజలందరి కోసం చేసే చట్టాలు ఆ రాష్ట్రంలో అమలుకాకపోవడంవల్ల 1.50 కోట్ల మంది జమ్మూ-కశ్మీర్‌ ప్రజలు మోసపోయారు. ఒక్కసారి ఆలోచించండి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పిల్లలకు విద్యా హక్కు చట్టం అమలవుతున్నా జమ్మూ-కశ్మీర్‌ పిల్లలకు మాత్రం అది అందని ద్రాక్షే. ఆ పిల్లలు చేసిన నేరమేంటి? దేశంలోని మిగతా రాష్ట్రాల్లో బాలిలకు లభించే హక్కులేవీ  జమ్మూ-కశ్మీర్‌ వారికి దక్కలేదు. మిగతా రాష్ట్రాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక చట్టం ఉన్నా ఆ రాష్ట్రంలోని కార్మికులకు మాత్రం అది ఎండమావే. దళితులపై జరిగే అత్యాచారాల నిరోధానికి మిగతా రాష్ట్రాల్లో కఠిన చట్టాలు అమలవుతున్నా కశ్మీర్‌లో మాత్రం అవి లేవు. మిగతా రాష్ట్రాల్లో మైనార్టీల కోసం చట్టం అమల్లో ఉన్నా.. ఈ రాష్ట్రం మాత్రం లేదు. మిగతా రాష్ట్రాల్లో శ్రామికుల రక్షణ కోసం కనీస వేతన చట్టం అమల్లో ఉంటే జమ్మూ-కశ్మీర్‌లో అది కాగితాలకే పరిమితమైంది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నా జమ్మూ-కశ్మీర్‌లోని ఆయా వర్గాల ప్రజలు ఈ అదృష్టానికి నోచుకోలేదు.

ఆలోచించాకే…. నిర్ణయం 
370 అధికరణం రద్దు చేయడంతోపాటు, కొంతకాలంపాటు జమ్మూ-కశ్మీర్‌ను నేరుగా కేంద్రపాలనలో ఉంచాలని చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. దీని వెనకున్న కారణాలను ప్రజలు తెలుసుకోవాలి. అక్కడ గవర్నర్‌ పాలన పెట్టిన నాటినుంచి స్థానిక పాలన నేరుగా కేంద్రం ఆధీనంలో వచ్చింది. దీనివల్ల గత కొన్నినెలలుగా క్షేత్రస్థాయిలో సుపరిపాలన కనిపిస్తోంది. ఇదివరకు కాగితాలకే పరిమితమైన పథకాలన్నీ ఇప్పుడు ఆచరణలోకి వచ్చాయి. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. పాలనలో వేగం, పారదర్శకతకు  ప్రయత్నించాం. దీనివల్ల ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌తోపాటు, సాగునీటి, విద్యుత్తు ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, విమానాశ్రయ ఆధునికీకరణ వేగం పుంజుకున్నాయి. అవినీతి నిరోధకశాఖ గట్టిగా పనిచేస్తోంది. దేశవిభజన తర్వాత పాకిస్థాన్‌ నుంచి వచ్చిన వారికి ఓటు హక్కుకానీ, ఎన్నికల్లో పోటీచేసే అధికారంకానీ లేదు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు వలసవచ్చిన పాకిస్థానీలకు భారత్‌లో అన్ని హక్కులూ ఉన్నాయి. ఎంతకాలం ఆ అన్యాయం కొనసాగాలి?

విద్య, ఉపాధి
ఇప్పుడు 370 అధికరణం చరిత్రలో కలిసిపోయిన నేపథ్యంలో ఆ చేదు ఫలితాల నుంచి ఆ రాష్ట్రం వేగంగా బయటపడుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. కొత్త కేంద్రపాలన వ్యవస్థలో అక్కడి ఉద్యోగులు, పోలీసులతో సహా అందరికీ మిగతా కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు అందుతాయి. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంత ఉద్యోగులకు ఎల్‌టీసీ, హెచ్‌ఆర్‌ఏ, విద్యా భత్యం, ఆరోగ్య పథకాలు అమల్లో ఉన్నాయి. అవన్నీ జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ ఉద్యోగులకూ తక్షణం అమలుచేస్తాం. సాధ్యమైనంత త్వరగా అక్కడ ఖాళీగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తాం. దీనివల్ల స్థానిక యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడానికీ ప్రోత్సాహం అందిస్తాం. సైన్యంలోని ఉద్యోగాలను స్థానిక యువతతో భర్తీచేయడానికి ప్రత్యేక నియామక కార్యక్రమాలను నిర్వహిస్తాం.

యువతలో తేజస్సు
ప్రైవేటు రంగం జమ్మూ-కశ్మీర్‌లో సాంకేతికతను విస్తృతం చేయడానికి నడుం బిగించాలి.   అక్కడి యువతలో తేజస్సు ఉంది. ఆంగ్ల పరిజ్ఞానం ఉంది. అందువల్ల సాంకేతికత ఎంత ఎక్కువగా అక్కడ విస్తృతమైతే ప్రజల జీవితం అంత సౌకర్యంగా ఉంటుంది. ఉపాధి పెరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయం జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ యువతకు జవసత్వాలను ఇస్తుంది. క్రీడల్లో ముందుకెళ్లే వారికోసం కొత్త క్రీడా అకాడమీలు, ప్రాంగణాలు ఏర్పాటుచేసి ప్రపంచస్థాయి శిక్షణ ఇప్పించి అంతర్జాతీయ వేదికలపై ప్రతిభను చాటేందుకు చేయూతనిస్తాం. కశ్మీర్‌ పిల్లలు ప్రపంచంలో భారత్‌ పేరును మార్మోగించేలా చేస్తాం.

స్థానిక సంస్థలు అద్భుతం
4, 5 నెలల కిందట అక్కడ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. వారితో సుదీర్ఘంగా చర్చించా. స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రతి గ్రామంలో వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రతి ఇంటికీ విద్యుత్తు, మరుగుదొడ్ల ఏర్పాటులో వారి భూమిక ఉంది. ముఖ్యంగా మహిళా ప్రతినిధులు అద్భుతంగా పనిచేశారు. ఇప్పుడు ‘370’ రద్దుతో పంచాయతీ సభ్యులకు కొత్త వ్యవస్థలో పనిచేసే అవకాశం వస్తుంది. అప్పుడు అందరూ అద్భుతాలు సాధిస్తారు. ఇకమీదట జమ్మూ-కశ్మీర్‌ ప్రజలు వేర్పాటువాదం నుంచి కొత్త ఆశలు, శక్తి, కలలవైపు నడుస్తారు. సుపరిపాలన, పారదర్శక వాతావరణంలో కొత్త ఉత్సాహంతో సరికొత్త లక్ష్యాలు చేరుకుంటారన్న నమ్మకం ఉంది. ఇప్పటివరకూ ఇక్కడున్న కుటుంబపాలన జమ్మూ-కశ్మీర్‌ యువతకు కొత్త నాయకత్వాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు యువత జమ్మూ-కశ్మీర్‌ అభివృద్ధికి నాయకత్వం వహిస్తుంది. యువత, తల్లులు, చెల్లెళ్లు అంతా అభివృద్ధికోసం ముందుకు రావాలి.

పారదర్శకంగా ఎన్నికలు
కొత్త వ్యవస్థ ఏర్పడ్డాక అందరం కలిసి ఉగ్రవాదం, వేర్పాటువాదం నుంచి జమ్మూ-కశ్మీర్‌కు విముక్తి కల్పించాల్సి ఉంది. భూతల స్వర్గమైన మనరాష్ట్రాన్ని మరోసారి అభివృద్ధి శిఖరాలు అధిరోహింపజేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాలి. అక్కడి ప్రజలకు ఒకటే స్పష్టం చేయదలచుకున్నా. మీ ప్రజాప్రతినిధులు మీ ద్వారానే ఎన్నికవుతారు. మీమధ్య నుంచే వస్తారు. ఇదివరకు ఎమ్మెల్యేలు ఎలా అయ్యేవారో ఇప్పుడుకూడా అలాగే అవుతారు. గతంలో మాదిరిగానే మంత్రివర్గం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి కూడా పాత పద్ధతిలోనే ఎన్నికవుతారు. ఈసారి ఎన్నికల తర్వాత స్థానిక యువతే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అవుతారు. పంచాయతీ ఎన్నికల తరహాలో పూర్తి జవాబుదారీతనం, పారదర్శక వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ మండళ్లను త్వరగా ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోరాను. చట్టసభలు, పరిపాలన వ్యవస్థలు జనహిత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తే జమ్మూ-కశ్మీర్‌ ఎంతోకాలం కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాల్సిన అవసరం ఉండదు. లద్దాఖ్‌ మాత్రం కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంటుంది.

 

tags : modi, kashmir, development

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *