నవంబర్ 4 లేదా 5 న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల ?

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ :  రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్‌లో మున్సిపల్ ఎన్నికలను పూర్తిచేయాలని అటు ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నాయి. గురువారం సింగిల్ జడ్జి ధర్మాసనం విచారణ అనంతరం జారీ అయ్యే ఉత్తర్వుల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. నవంబర్ నాలుగు లేదా ఐదో తేదీన మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలుస్తున్నది. ఇప్పటివరకు ఉన్న పరిణామాలు, కోర్టుకు సమర్పించిన నివేదికల ప్రకారం తీర్పు అనుకూలంగా వస్తుందని భావిస్తున్న ఎన్నికల సంఘం.. ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. రెండురోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. మహిళల రిజర్వేషన్లను శుక్ర, శనివారాల్లో పూర్తిచేసే అవకాశాలున్నాయి. అనంతరం నవంబర్ 4 లేదా 5న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువరిస్తారని తెలుస్తున్నది. నవంబర్ 25 వరకు ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయనున్నారు.

ఓటర్లు 50.37 లక్షల మంది

ఈ ఏడాది జూలై 16న విడుదలచేసిన జాబితా ఆధారంగా రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో 50,37,498 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికలసంఘం అధికారులు వెల్లడించారు. ఇటీవల మార్పులు, చేర్పులు, సవరణలకు అవకాశం కల్పించడంతో మరో నాలుగైదు లక్షలమంది ఓటర్లు పెరిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు. జూలై నాటి జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాలు, వార్డుల విభజన చేస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల పరిధిలో బ్యాలెట్ పత్రాల ముద్రణకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. గత ఎన్నికలతో పోల్చితే దాదాపు 10%-20% అదనంగా బ్యాలెట్ పత్రాలను ముద్రించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని దాదాపు 50 మున్సిపాలిటీల పరిధిలో ఇంకా వార్డుల విభజన జాబితాను ఫైనల్ చేయకపోవడంపై ఎస్‌ఈసీ నాగిరెడ్డి మంగళవారం జరిగిన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఈ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలుస్తున్నది.

అధికారులు, సిబ్బంది నియామకం

మున్సిపాలిటీలవారీగా ఎన్నికల అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నారు. మంగళవారం కలెక్టర్ల సదస్సు అనంతరం సిబ్బందికి, అధికారులకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి పీవో, ఏపీవోలు, ఓపీవోలను నియమించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పీవోలను 20%, ఏపీవోలను 10% నుంచి 20%, ఓపీవోలను 10% నుంచి 30% వరకు అదనంగా నియమిస్తూ రిజర్వులో ఉండాలని ఆదేశాలిచ్చారు. మరోవైపు జిల్లాస్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియకు నోడల్ అధికారులను విభాగాలవారీగా నియమిస్తున్నారు.

 

tags : muncipal elections, november, notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *