నల్లధన డబ్బెక్కడ ?

బిజెపిపై మంత్రి జగదీశ్‌ రెడ్డి ఫైర్

సూర్యాపేట, అక్షిత బ్యూరో :

అధికారంలోకి రాగానే విదేశాల నుంచి నల్లధనం తెస్తానన్న మోడీ వాగ్దానం ఏమైందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి ప్రశ్నించారు. తప్పుడు హామీలతో బీజేపీ ప్రజలను మోసగించిందని అన్నారు. అదాని, అంబానీల కోసమే కేంద్రం పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. బీజేపీ పాలనలో ఆకాశాన్ని అంటుతున్న ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెన్షనర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీకి ఓటు వేయడమంటే పెరిగిన గ్యాస్, డీజిల్,పెట్రో ధరలను సమర్ధించడమేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గినా పెట్రోల్ ధర రూ.100 దాటడం దారుణమని అన్నారు. కరోనాతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 40 వేల కోట్ల నష్టం వాటిల్లినా సంక్షేమం ఆగడంలేదని చెప్పారు. ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ కూడా అమలు చేస్తామని పీఆర్సీ వారి హక్కు అని పేర్కొన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నూటికి నూరు శాతం మ్యానిఫెస్టోను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి చెప్పారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని మరోసారి గెలిపించాలని ఆయన కోరారు. గడిచిన ఆరేండ్లలో ప్రభుత్వానికి పట్టభద్రులకు పల్లా వారధిగా పనిచేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణగౌడ్, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రావు, కార్యదర్శి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *