నల్లధనంపై సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్

న్యూఢిల్లీ: 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకు నల్లధనంపై ప్రజల నుంచి సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. దేశ రాజధానిలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో భాగంగా 1800117574 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ధన బలాన్ని దుర్వినియోగం చేయడం, అక్రమంగా డబ్బులు పంచిపెట్టడం సహా ఇతర ఎన్నికల సంబంధిత నేరాలపై నిఘా వేసేందుకు 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఇండియన్ రెవెన్యూ సర్వీసుల (ఐఆర్ఎస్) నుంచి 22 మంది అధికారులను నియమించింది. ఢిల్లీలోని ఐటీ శాఖకు చెందిన ఇన్వెస్టిగేషన్ విభాగంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నుంచి కూడా తాత్కాలికంగా 22 మంది ఐఆర్ఎస్ అధికారులను ఎన్నికల విధుల నిమిత్తం పంపాల్సిందిగా ఈసీ కోరినట్టు సమాచారం. అనుమానాస్పద ఆర్ధిక లావాదేవీలపై నిఘా వేయాలని… అక్రమాలు జరుగుతున్నట్టు తేలితే వెంటనే చెక్ పెట్టాలంటూ పొరుగు రాష్ట్రాల్లోని సీబీడీటీ అధికారులకు కూడా ఈసీ ఆదేశించింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ వచ్చే నెల 8న ఎన్నికలు జరగనున్నాయి. 11న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *