దేశంలోనే పేటకు సుస్థిర స్థానం

సూర్యాపేట, అక్షిత ప్రతినిధి : సూర్యాపేటకు సుస్థిర స్థానం మంత్రి జగదీశ్ రెడ్డి దేశ     చిత్రపటంలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి సుస్థిర స్థానం లభించబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న కబడ్డీ పోటీలలో యావత్ భారతదేశం పేట వైపే దృష్టి సారించిందని ఆయన అన్నారు. మార్చి నెలలో జరుగనున్న 47వ జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల నిర్వహణకు సూర్యాపేట ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, పీఈటీలు, పీడీ లు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. 47 వ జాతీయస్థాయి సబ్ జూనియర్ పోటీలు నిర్వహణ అనేది భవిష్యత్ తరాలు మరో 47 ఏండ్లు చెప్పుకునే స్థాయిలో ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. పోటీల నిర్వహణలో ఎక్కడా అలసత్వం కూడదని,జాతీయ స్థాయిలో జరుగుతున్న పోటీలకు హాజరయ్యే క్రీడకారులతో పాటు వారి సంరక్షకుల రక్షణ కూడ మనదే నన్నారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల నిర్వహణ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం సూర్యాపేట కు రావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఈ పోటీల తర్వాత జాతీయ స్థాయిలో సూర్యాపేటకు సుస్థిర స్థానం ఏర్పడబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా క్రీడా పోటీల నిర్వహణ సమయంలో బాధ్యులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పోటీల నిర్వహణలో ఎక్కడా అలసత్వం కూడదని జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసేందుకు ఇది ఒక సువర్ణావకాశంగా ఆయన అభివర్ణించారు. మొదటి నుండి క్రీడల ఉన్నతికి సూర్యాపేట పెట్టింది పేరు అని,ఇక్కడి ప్రభుత్వ ప్రయివేట్ పీఈటీలతో పాటు పీడీల కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు.గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. క్రికెట్ తో సరిసమానంగా కబడ్డీకి క్రేజ్ పెరిగిందని దానిని ఈ పోటీల ద్వారా మరింత ఇనుమడించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్ యాదవ్, సూర్యాపేట కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, రామచందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *