త్రిష నిర్ణయానికి కారణమేంటో?

నటి త్రిష తాజాగా ఒక అనూహ్య నిర్ణయం తీసుకుందట. అయితే దాని వెనుక కారణం ఏమిటబ్బా అనే ఆరాలు తీస్తున్నారు సినీ వర్గాలు. ఈ అమ్మడు తమిళంలో, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోలందరితోనూ జత కట్టేసింది. ఒక్క రజనీకాంత్‌తో తప్ప. అయితే ఆ చిరకాల ఆశ ఇప్పుడు పేట్ట చిత్రంతో నెరవేరింది. రజనీకాంత్, త్రిష జంటగా నటిస్తున్న పేట్ట చిత్రం శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటోంది. వచ్చే ఏడాది జనవరిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

చెన్నై చిన్నది చాలా రోజుల తరువాత 96 చిత్రంతో సక్సెస్‌ మజాను అనుభవిస్తోంది. విజయ్‌సేతుపతికి జంటగా నటించిన 96 చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. నటి త్రిష నటనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అమ్మడు 12 ఏళ్లకు పైగా కథానాయకిగా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో త్రిష ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకుందన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఇటీవల లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలను, యువ నటులకు జంటగా నటిస్తున్న ఈ బ్యూటీ తాజాగా సీనియర్‌ హీరోలతోనూ నటించడానికి సిద్ధం అంటోందట. అంతే కాదు తన పారితోషికాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకుందట. దీంతో ఆమె సహ నటీమణులను ఆలోచనలో పడేసిందంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు. త్రిష పారితోషికం తగ్గించుకోవాలన్న నిర్ణయం వెనుక కథేంటన్న ఆరాలను సినీ వర్గాలు తీయడం మొదలెట్టాయి. అగ్రనాయికలను దెబ్బ కొట్టాలన్న ఆలోచనలో ఈ భామ ఉందా అన్న కోణంలో కూడా చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ గర్జన, చతురంగవేట్టై–2, 1818, పరమపదం విళైయాట్టు, పేట్ట చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా 96 తెలుగు రీమేక్‌లోనూ త్రిషకే హీరోయిన్‌ అవకాశం వరించనుందని సమాచారం. ఈ అమ్మడు తెలుగులో నటించి చాలా కాలమైంది. కాగా 96 చిత్ర రీమేక్‌ హక్కులను భారీ మొత్తంలో నిర్మాత దిల్‌రాజ్‌ కొనుగోలు చేశారన్న విషయం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఇందులో నటుడు నానీ హీరోగా నటించనున్నట్లు సమాచారం. తాజాగా కథానాయకిగా నటి త్రిషను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నట్టు టాక్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *