తెలంగాణ శాంతికాముక రాష్ట్రం

గతంలో ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఎలాంటి అలజడులూ చోటుచేసుకున్న దాఖలాలు లేవని, శాంతికాముక రాష్ట్రంగా తెలంగాణకు మంచి పేరుందని కేంద్ర ఎన్నికలసంఘం బృందానికి టీఆర్‌ఎస్ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న పరిస్థితులపై అంచనావేసేందుకు ఎన్నికలసంఘం చీఫ్ కమిషనర్ ఓపీ రావత్, కమిషనర్లు సునీల్‌అరోరా, అశోక్‌లావాసాతోపాటు ఉన్నతాధికారులు ఉమేశ్‌సిన్హా, సందీప్‌సక్సేనా, సందీప్‌జైన్, చంద్రభూషణ్‌కుమార్, దిలీప్‌శర్మ, ధీరేంద్ర ఓఝా, సుందర్‌భైల్‌శర్మ, ఎస్కే రుడోలా సోమవారం హైదరాబాద్‌లో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రతినిధులు ఎంపీ బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేత రవీందర్‌రావు ఎన్నికలసంఘం ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ అధికారుల సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ వినోద్.. రాష్ట్రంలో ఎలాంటి అరాచకశక్తులకు తావులేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీల వ్యవహారాలను నిశితంగా పరిశీలించడమే కాకుండా కోడ్ ఉల్లంఘించినవారిపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే మద్యం, డబ్బుల అక్రమ రవాణాపై దృష్టిపెట్టి, పెద్దఎత్తున పట్టుకుంటున్నారని తెలిపారు.

పెయిడ్ న్యూస్ అంశాన్ని గట్టిగా పరిశీలించాలి
చానళ్లు, దినపత్రికల్లో వచ్చే కథనాలను నిశితంగా పరిశీలించి, ఏవి పెయిడ్ ఆర్టికల్స్ కిందికి వస్తాయి? వేటిని వార్తలుగా చూడాలనేదానిపై దృష్టి పెట్టాల్సి ఉందని వినోద్ అన్నారు. పెయిడ్ ఆర్టికల్స్ అంశంపై సీనియర్ పాత్రికేయులు, మీడియాపై అవగాహన ఉన్నవారు కమిటీలో ఉన్నారు కాబట్టి మీడియాలో వచ్చే వార్తాకథనాలు సాధారణ వార్తల కిందకు వస్తాయా? పెయిడ్ ఆర్టికల్స్ కిందికి వస్తాయా? అనేది నిర్ధారించిన తర్వాతే నోటీసులు జారీచేస్తే బాగుంటుందని సూచించినట్టు తెలిపారు. ఒక అభ్యర్థి సాధారణంగా ప్రచారం చేసుకున్న వార్తను కవర్‌చేస్తే అది సాధారణ వార్త అవుతుందని, అదే ఒక అభ్యర్థి భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారని వచ్చే కథనం పెయిడ్ ఆర్టికల్ కిందికి వస్తుందనే వ్యత్యాసాన్ని గుర్తించాలన్నారు.

ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు అడ్డంకి లేదు
కేర్‌టేకర్ ప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను పర్యవేక్షించే సమయాన్ని కోడ్ ఉల్లంఘన కింద చూడరాదని ఈసీ దృష్టికి తెచ్చామని వినోద్ తెలిపారు. ఇలాంటివాటికి సూర్యాపేట ప్రాంతంలో నోటీసులు జారీచేశారని చెప్తూ.. ఇది కోడ్ ఉల్లంఘన కిందకు రాదని వివరించామన్నారు. తమ వాదనతో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఏకీభవించినట్టు చెప్పారు. కొత్తగా ప్రారంభోత్సవాలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని ఈసీ చెప్పినట్టు తెలిపారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల అభివృద్ధి పనులను ఆపివేయటం సరికాదని, అవి గతంలోనే ప్రభుత్వం ప్రారంభించిన పనులని, కొత్తవికావని వివరించామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో టెండర్లను ఆపుతున్నారని, దీనిపై ఎలాంటి అభ్యంతరాలు చెప్పరాదని ఎన్నికల ప్రధానాధికారికి వివరించామని తెలిపారు.మిలాద్ ఉన్ నబీని అనుమతించాలి: అసదుద్దీన్

మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా నవంబర్ 21, 22 తేదీల్లో తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో మిలాద్ ఉన్ నబీ సంబురాలను యథాతథంగా నిర్వహించుకోవటానికి అనుమతినివ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. నలభై ఏండ్లుగా ఏటా రెండురోజులపాటు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారని ఈసీకి వివరించామని అనంతరం మీడియాకు అసదుద్దీన్ తెలిపారు. ప్రతి 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌స్టేషన్ ఏర్పాటుచేయాలని నిర్ణయించారని, దీనిపై స్పష్టత లేకపోవడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. ఏ ఓటరు ఏ పోలింగ్‌స్టేషన్ పరిధిలో ఉన్నారో తెలియజేయాలని కోరారు. అత్యంత సున్నితమైన పాతబస్తీలోని మలక్‌పేట, యాకుత్‌పుర, చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్‌పుర, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలో పోలీస్ బలగాలను పెంచాలని విజ్ఞప్తిచేశారు. 2009, 2014 ఎన్నికల్లో పాతబస్తీలో ఎలాంటి అలజడులు లేవని, శాంతియుతంగా పోలింగ్ ముగిసిందని తెలిపారు.
ఈసారికూడా అంతా సవ్యంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని సూచించినట్టు చెప్పారు. టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గంధం గురుమూర్తి, కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, నిరంజన్, సీపీఐ నుంచి చాడ వెంకట్‌రెడ్డి, తక్కలపల్లి శ్రీనివాసరావు, సీపీఎం నుంచి నంద్యాల నర్సింహారెడ్డి, జే వెంకటేశ్, బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి, ఆంటోనీరెడ్డి, థామస్ సుబ్రమణ్యం, వైసీపీ నుంచి సంజీవరావు, బీఎస్పీ నుంచి సిద్ధార్థ పూలే తదితరులు ఎన్నికల సంఘం ప్రతినిధిబృందంతో సమావేశమై.. తమ అభిప్రాయాలను తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేదుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *