అక్షిత ప్రతినిధి, భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో బడులు మూతబడుతూ బార్లు తెరుచుకునే సంస్కృతిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో క్లబ్లు, పబ్ల సంస్కృతి పెరిగి ఆకృత్యాలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలో పార్టీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. బొమ్మల రామారం హజీపూర్ ఘటన అనంతరం 60 మందికి పైగా మహిళలు, యువతులు తప్పిపోయినా పోలీసులు ఎటూ తేల్చలేదన్నారు. ఫ్లండ్లీ పోలీసింగ్ పేరుపెట్టుకొని శాంతిభద్రతలను పరిరక్షిచండంలో తెలంగాణ పోలీసు శాఖ విఫలమైందన్నారు. హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో జరిగిన హత్యాచార ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ దేశం మొత్తం స్పందిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు పెదవి విప్పపోవడం విడ్డూరమన్నారు. అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయి ఉన్నారని.. త్వరలో తెరాస పాలనకు సమాధి కడతారని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు , రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు. ప్రేమేందర్రెడ్డి, పీఎస్ రవీందర్, ఎన్. నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
