తెదేపా ఎంపీలతో రేపు చంద్రబాబు కీలక భేటీ

రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం పార్టీ ఎంపీలతో తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలోని గ్రీవెన్స్‌ హాలులో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్‌ సమావేశాల్లో తెదేపా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెదేపా కేంద్ర ప్రభుత్వంపై పోరాట బాట పట్టింది. విభజన హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పార్లమెంట్‌ బయట, లోపలా ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అయితే, బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడినందున ఆ పోరాటానికి తాత్కాలికంగా విరామం వచ్చింది. అయితే, మళ్లీ ఈ నెల 5 నుంచి సమావేశాలు జరగనున్నందున విభజన హామీలతో పాటు రాష్ట్రానికి ప్రకటించిన హామీలన్నింటినీ సాధించేందుకు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని, రాష్ట్ర హక్కుల సాధన, వివిధ పార్టీలు అనుసరిస్తున్న విధానంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే వైకాపా కేంద్రంపై అవిశ్వాసం పెడతామని ప్రకటించడంతో ఆ అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *