తిత్లీ బీభత్సం

తిత్లీ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లో పెను బీభత్సం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అతి తీవ్ర తుఫానుగా మారి గురువారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో తీరాన్ని దాటింది. ఆ ప్రభావంతో కురిసిన అతి భారీ వర్షాలు, ఈదురు గాలులతో ఏపీ, ఒడిశాలో అపార ఆస్తి నష్టం సంభవించింది.. వేల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొబ్బరి, అరటి తోటలు ధ్వంసమయ్యాయి. వేల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏపీలో ఎనిమిది మంది చనిపోయారు. రైల్వే శాఖ ముందుగానే కొన్ని రైళ్లను రద్దు చేయగా, ఒడిశాలో ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తినష్టం జరిగింది. దాదాపు మూడు లక్షల మందిని ముందుగానే పునరావాస శిబిరాలకు తరలించారు. తుఫాన్ ప్రభావంతో మరో 24 గంటలపాటు ఒడిశా, ఏపీలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ విభాగం తెలిపింది. తెలంగాణలో తుఫాన్ ప్రభావం లేకున్నా ద్రోణి కారణంగా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అమరావతి/భువనేశ్వర్, అక్టోబర్ 11: బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుఫాను ఊహించినట్టుగానే పెను విధ్వంసం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లో అపార నష్టం కలుగజేసింది. గురువారం ఉదయం 4.45 గంటలకు శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో తుఫాను తీరాన్ని తాకిందని వాతావరణ విభాగం తెలిపింది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో ఏపీలో ఎనిమిదిమంది మృతిచెందగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. చెట్టు కూలి ఒకరు, ఇల్లు కూలి ఒకరు మరణించగా, సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు జాలర్లు కూడా మరణించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. సముద్రంలోకి వెళ్లిన 67 మత్స్యకారుల పడవల్లో 65 తిరిగి వచ్చాయని, మరో రెండింటి కోసం గాలిస్తున్నామని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో రోడ్లు, విద్యుత్ వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది.

ఈదురు గాలుల కారణంగా రెండువేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. బుధవారం రాత్రి నుంచి 4,319 గ్రామాలు, ఆరు పట్టణాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు కూలిన కారణంగా చెన్నై, కోల్‌కతా మధ్య జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా రైల్వే శాఖ కొన్ని రైళ్లు రద్దుచేసి, మరికొన్నింటిని దారి మళ్లించింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు విమానయాన శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పంట నష్టం భారీగా సంభవించినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా కొబ్బరి, అరటి, మామిడి చెట్లు అధిక సంఖ్యలో కూలిపోగా, వరి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 2014లో వచ్చిన హుద్‌హుద్ తుఫాను కంటే తిత్లీ నష్టం ఎక్కువగా ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 23 నుంచి 28 సెంటిమీటర్ల మేర వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈశాన్య దిశగా కదులుతున్న తుఫాను శుక్రవారం బలహీనపడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. అయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతోపాటు, ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *