తడారిన భూములకు మహర్దశ

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరాల జల్లు

ఈనెల 10న హాలియాలో సీఎం భారీ బహిరంగ సభ 

సభా వేదిక, ఏర్పాట్లను పర్యవేక్షించిన గుత్తా సుఖేందర్ రెడ్డి 

నాగార్జున సాగర్, అక్షిత ప్రతినిధి :

ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ధృడ సంకల్పంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను చేపట్టి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వరాల జల్లులు కురిపించనున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లతో నిర్మించతలపెట్టిన 8- 9 ఎత్తిపోతల పథకాలను ఈనెల 10న నెల్లికల్లులో శంఖుస్థాపన చేయనున్నారని అన్నారు. సీఎం శంఖుస్థాపన చేయనున్న ఎత్తి పోతల పథకాల ద్వారా మిర్యాలగూడ,నాగార్జున సాగర్, కోదాడ, హుజూర్ నగర్,దేవరకొండ నియోజకవర్గాల రైతులకు ప్రయోజనం చేకూరనుందని అన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం బుధవారం 2గంటలకు హాలియాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారని అన్నారు. బహిరంగ సభను నిర్వహించే వేదిక నిర్మాణం, ఏర్పట్లను స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి గుత్తా సుఖేందర్ రెడ్డి పర్యవేక్షించారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు ఇచ్చారు. సీఎం భారీ బహిరంగ సభకు పొరుగు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, రైతులు తరలివచ్చే అవకాశముందని అన్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు హాజరయ్యే కార్యకర్తలకు, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు ఈ కార్యక్రమం ముగిసేంత వరకు అందుబాటులో ఉండి సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంతో పాటు సరిపడ నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయిని అని అభిప్రాయపడ్డారు. నెల్లికల్లు ప్రాజెస్ట్ పూర్తి చేయాలని నాగార్జునసాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తన తుదిశ్వాస వరకు ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. నర్సింహయ్య కు నివాళులు అర్పిస్తూ సాగర్ నియోజక వర్గానికి చెందిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమాలు చేస్తూ తెలంగాణ రాష్టాన్ని బంగారు తెలంగాణాగా తీర్చిదిద్దారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి రుణం తీర్చుకునే అవకాశం నాగార్జున సాగర్ ప్రజలకు దక్కిందని అన్నారు. ఈ నెల10న చేపట్టనున్న ఎత్తిపోతల పథకాల శంఖుస్థాపన కార్యక్రమాన్ని, భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్లు బాలు మల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్ , జడ్పీ వైస్ చైర్మన్ ర పెద్దులు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ యువనేత నోముల భగత్, గడ్డంపల్లి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *