ఢిల్లీ టూ లండన్ బస్ రద్దు

న్యూ ఢిల్లీ, అక్షిత ప్రతినిధి :

కరోనా ఎఫెక్ట్ … ఢిల్లీ టూ లండన్ బస్ పై పడింది. కరోనా ఉదృతితో బస్ రద్దయ్యింది. కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించబడింది. కరోనా లాక్ డౌన్ ప్రభావం ప్రజా రవాణాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇప్పుడు ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే బస్సు సర్వీసుపై ఈ కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా బాధితుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో గుర్గావ్‌కు చెందిన అడ్వెంచర్ ఓవర్‌ల్యాండ్ కంపెనీ ఏప్రిల్‌లో ప్రారంభించబోయే బస్సు సర్వీసును రద్దు చేసింది.
ఈ ఏడాది ఈ బస్ సర్వీస్ బుకింగ్స్ రద్దు చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ బుకింగ్స్ 2022 ఏప్రిల్ నెల నుండి ప్రారంభమవుతాయి. భారతదేశంలో కరోనావైరస్ ఎక్కువగా ఉండటం వల్ల ఇతర దేశాలకు ప్రయాణించే ప్రయాణికులు పరిమితం చేయబడ్డారని కంపెనీ తెలిపింది.
కరోనా సంక్రమణ నేపథ్యంలో ఈ ఏడాది అన్ని పర్యటనలను రద్దు చేయాలని కంపెనీ నిర్ణయించింది. అడ్వెంచర్ ఓవర్‌ల్యాండ్ కంపెనీ బస్సు 70 రోజుల్లో ఢిల్లీ నుంచి లండన్‌కు వెళుతుంది. ఈ బస్సు ఢిల్లీ నుండి బయలుదేరి 18 దేశాల ద్వారా దాదాపు 20,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి బ్రిటన్ రాజధాని లండన్‌కు చేరుకుంటుంది.
ఈ బస్సు సర్వీస్ కి ‘బస్ టు లండన్’ అని కంపెనీ పేరు పెట్టింది. ఈ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు మయన్మార్, థాయిలాండ్, లావోస్, చైనా, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, కజాఖ్స్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం మరియు ఫ్రాన్స్ మీదుగా లండన్ చేరుకుంటారు.

లండన్ వెళ్లే ఈ బస్సులో 20 సీట్లు ఉన్నాయి. అందులోని అన్ని సీట్లు బిజినెస్ క్లాస్‌కు చెందినవి. ఈ బస్సులో డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గైడ్ మరియు ఇతర సిబ్బందితో పాటు 20 మంది ప్రయాణికులు ఉంటారు.

ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే ప్రయాణికులు ఒక్కొక్కరికి టికెట్టు ధర రూ. 15 లక్షలు చెల్లించాలి. ఈ 70 రోజుల పర్యటనలో ప్రయాణికులు 4 లేదా 5 స్టార్ హోటళ్లలో ఉండటానికి అనుమతిస్తుంది. ఈ పర్యటనలో పర్యాటకులు తమ సొంత ఆహారం మరియు ఎంటర్టైన్మెంట్ వంటివి ఆస్వాదించవచ్చు.

ఢిల్లీ నుంచి లండన్ వరకు బస్సు ప్రయాణం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నెన్నో దేశాల్లో ప్రయాణిస్తూ కొత్త సంస్కృతులను, కొత్త కొత్త ఆహారాలను రుచి చూడవచ్చు. 70 రోజుల ఈ ప్రయాణం జీవితంలో ఒక గొప్ప మధురమైన అనుభూతిని మిగులుస్తుంది. కానీ కరోనా మహమ్మారి దీనిని పూర్తిగా రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *