త్వరలో పుంజుకునేలా చేద్దాం
ఉద్యోగులతో రతన్ టాటా
గత నాలుగైదేళ్లలో టాటా మోటార్స్ తన మార్కెట్ వాటాను కోల్పోవడం.. దేశం దాన్ని ‘ఒక వైఫల్య కంపెనీ’గా చూడడం తనను బాధించిందని టాటా మోటార్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా పేర్కొన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం రోజున ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించే కంపెనీ ఆనవాయితీని దాదాపు అయిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభించడం విశేషం. ‘ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఎండీ గుంటెర్ బషెక్ల నాయకత్వంలో టాటా మోటార్స్ తన భవిష్యత్ నిర్మాణాన్ని కొనసాగిస్తుంద’ని ఈ సందర్భంగా టాటా ఆశాభావం వ్యక్తం చేశారు. ‘టాటా మోటార్స్‌కు చెందిన వాడిగా నాకు గర్వంగా ఉంటుంది. అయితే గత నాలుగైదేళ్లలో మార్కెట్ వాటాను కోల్పోయాం. ఒక వైఫల్య కంపెనీగా భారత్ మమ్మల్ని చూసింది. కానీ మనలో ఉన్న స్ఫూర్తి, అపార సామర్థ్యాలతో మనం మళ్లీ పుంజుకుంటామ’ని ఆశాభావం వ్యక్తం చేశారు. టాటా గ్రూప్‌లో దిగ్గజ కంపెనీగా టాటా మోటార్స్ ఉండేది. తిరిగి అలా మారడానికి మనం ప్రణాళిక సిద్ధం చేయాల’ని పిలుపునిచ్చారు.
‘రెండో రాణింపు’నకు సిద్ధం
గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాల(సీవీ) విభాగంలో విజయం సాధించిన అనంతరం ఇపుడు ‘రెండో రాణింపు(టర్నరౌండ్ 2.0)’నకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రయాణ వాహనాల(పీవీ)పై దృష్టి సారించనుంది. భవిష్యత్‌లో తనకు తాను ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంతో పాటు.. దేశీయ మార్కెట్లో మరింత మెరుగైన ర్యాంకు దిశగా నడిపించడంలో మాకు పీవీ వ్యాపారం సహాయం చేసేలా చేయడమే ఈ టర్నరౌండ్ 2.0 లక్ష్యమని కంపెనీ ఎండీ, సీఈఓ గుంటెర్ బషెక్ ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు. కొత్త ఆర్థిక సంవత్సరం (2018-19)లో టాటా మోటార్స్ తన లక్ష్యాలను చేరుకోగలదని కంపెనీ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ కంపెనీపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది వాటిని అది చేరుకుంటుందన్న విశ్వాసం నాకుంది. గతేడాది నేనేదైనా సానుకూలంగా మాట్లాడి ఉంటే.. అది ఆశావహ దృక్పథంతో చేశా. కానీ ఈ ఏడాది మాత్రం పూర్తి విశ్వాసంతో ఈ సానుకూల ప్రకటనలు చేస్తున్నా’నని ఆయన అన్నారు. ‘గత ఆర్థిక సంవత్సరాన్ని 23 శాతం సంయుక్త వృద్ధితో విక్రయాలను మెరుగ్గా ముగించాం. సీవీ, పీవీ విభాగాల్లో కలిసి దేశీయంగా 5,86,639 వాహనాల విక్రయాలు చేశాం. అంతక్రితం ఏడాది ఈ అమ్మకాలు 4,78,362గా ఉన్నాయి. అయితే ఇంకా బోర్డు అంచనాలను అందుకోవాల్సి ఉంద’ని పుణెలోని ఉద్యోగులను ఉద్దేశించి బషెక్ పేర్కొన్నారు.