జ్ఞానసంపదతోనే పేదల ఉన్నతి :  ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

అక్షిత ప్రతినిధి, అలంపూర్ :  జ్ఞానసంపదతోనే  పేదలు  ఉన్నత స్థాయికి చేరుకుంటారని గురుకుల  పాఠశాలల  రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీన్‌కుమార్ అన్నారు. సమాజంలో ప్రతి ఇల్లు ఓ పాఠశాలగా మారి జ్ఞానవంతులుగా మారడానికి       ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆదివారం అలంపూరులో ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆలంపూర్ క్రాస్ రోడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం అలంపూర్ కు చేరువ నుంచి సుమారు 3కిమీ దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు భవితకు…భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన కుటుంబాల గురించి కవులు పాటల రూపంలో రాసి స్ఫూర్తిగా నిలవాలన్నారు. పంట చేలల్లో కూలీల కష్టాల గురించి, వారు పడుతున్న బాధల గురించి రాయాలన్నారు. అలంపూర్ క్షేత్రం నుంచి ప్రారంభమైన ఏ కార్యక్రమమైన విజయవంతమైందని, ఈ యాత్ర కూడా విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఏపూరి సోమన్న మాట్లాడుతూ సమాజ మార్పు కోసం, జ్ఞాన సమాజ నిర్మాణం కోసం అన్ని వర్గాల వారిని ఏకం చేయాలనే ఆలోచనలతోనే ఈ యాత్ర చేపడుతున్నట్టు ఆయన వివరించారు. అలంపూరు నుంచి ఆదిలాబాద్ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ 100 రోజులు పూర్తి చేసుకుని జనవరి 3 న జ్యోతిబా పూలే జయంతి రోజున హైద్రాబాద్ చేరుకుంటుందని పేర్కోన్నారు. అలంపూర్ క్షేత్రం నుంచి అదీను గాక ఆర్ ప్రవీన్‌కుమార్ సార్ పుట్టిన గడ్డ నుంచి జ్ఞాన చైతన్య యాత్ర మొదలుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వేరోస్ సంస్థ ఆధ్వర్యంలో వారి సహకారంతో చేపడుతున్న ఈ యాత్ర అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేయగలనన్నారు. సమావేశంలో ఏపూరి రాసిన పాటల పుస్తకాలను ఆవిష్కరించారు. ఏపూరి మిత్ర బృందం ఆట పాటలతో అలరించారు. అలంపూర్ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా స్వేరోస్ టీ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. యాత్ర సందర్భంగా నిర్వహించిన 5 కే రన్‌లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.రమేష్,  చెరుకు సుధాకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, విజయ్‌కుమార్, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్,  హైదరాబాద్ పబ్లిక్ స్కూలు పిటీఏ మాజీ అధ్యక్షులు ఎడవల్లి నర్సింహ, సీనియర్ జర్నలిస్ట్ మాతంగి దాస్, దేవదాసు, టీజీపీఏ మహేశ్, ప్రసన్నకుమార్, స్వాములు, కేశవ్ తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

 

 

tags : rs praveenkumar, gnana chaitanyayatra, alampur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *