జైపాల్‌ ప్రస్థానమిది…

హైదరాబాద్‌ : కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రాజకీయవేత్త సూదిని జైపాల్‌రెడ్డి. తాను చేపట్టిన అన్ని పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. మన్మోహన్‌ హయాంలో పట్ణణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. దక్షిణాది నుంచి గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా జైపాల్‌రెడ్డికి పార్టీలో మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన జైపాల్‌.. తెలంగాణ ఉద్యమ సమయంలో దిల్లీ కేంద్రంగా క్రియాశీలకంగా వ్యవహరించారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన  ఈనెల  20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ర్టో ఎంటరాలజీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ఇంగ్లిష్‌లో దిట్ట..
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మాడుగుల సమీపంలోని నెర్మెట్ట అనే చిన్న గ్రామంలో 1942 జనవరి 16న జైపాల్‌రెడ్డి జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపాల్‌ రెడ్డి తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. మాడుగుల, నల్గొండ జిల్లా దేవరకొండలో జైపాల్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు, ఎంఏ ఇంగ్లిష్‌ లిట్‌రేచర్‌లో పట్టా పొందారు. డిగ్రీ స్థాయిలోనే రోజుకి ఆరు ఆంగ్ల పత్రికలు చదివేవారు. ఏ అంశంపై అయినా అనర్గళంగా మాట్లాడగల నేర్పు ఆయన సొంతం. పుస్తక పఠనం అంటే అమితాసక్తి. విద్యార్థి దశనుంచి జైపాల్‌రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

రాజకీయ ప్రస్థానం…
* విద్యార్థి సంఘ నాయకుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జైపాల్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. రెండుసార్లు విశ్వవిద్యాలయ ఎన్నికల్లో విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యారు.
* 1965-71 మధ్య జాతీయ స్థాయిలో యూత్‌ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు అనేక మంది జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి.
* అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాలుగు సంవత్సరాల పాటు వ్యవహరించారు.
* 1969లో తొలిసారి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన వరుసగా నాలుగుసార్లు అదే స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు.
* అనంతరం కాంగ్రెస్‌ అత్యవసర పాలనను వ్యతిరేకిస్తూ 1977లో కాంగ్రెస్‌ను వీడారు. అనంతరం 1979లో జనతాపార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
* 1980లో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
* 1984, 98లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
* 1977లో కాంగ్రెస్‌ను వీడిన ఆయన తిరిగి 1999లో మళ్లీ అదే గూటికి చేరారు.
* 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు.

* 2009లో చేవెళ్ల ఎంపీగా ఎన్నికయ్యారు.
* 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
* జూన్‌ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు
* 1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.

కీలక పదవులు, విజయాలు
* ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
* మన్మోహన్‌సింగ్‌ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా దిల్లీ మాస్టర్ ప్లాన్‌లో కీలక పాత్ర పోషించినట్లుగా ఆయనకు గుర్తింపు ఉంది.
* పలుసార్లు పార్లమెంటు స్థాయీ సంఘాలు, సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా వ్యవహరించారు.
* ప్రసార భారతి బిల్లును ప్రవేశపెట్టడం, అమలులో జైపాల్‌ రెడ్డిదే కీలక పాత్ర.
* ఎఫ్‌ఎం రేడియో ఛానెళ్లను విస్తృతీకరణకు ఎనలేని కృషి.
* ఉభయసభల ప్రత్యక్షప్రసారాల విధానాన్ని సూత్రీకరించి, దాన్ని అమలులోకి తెచ్చిన ఘనత జైపాల్‌ రెడ్డిదే.
* దిల్లీ మాస్టర్‌ ప్లాన్‌ని అమలు చేసి అందులో భాగంగా దేశ రాజధాని ట్రాఫిక్‌ కష్టాలకు పరిష్కారంగా నిలిచిన మెట్రో సర్వీస్‌ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
* 2010 కామన్వెల్త్‌ పోటీల మౌలిక వసతుల ఏర్పాటు బాధ్యతలు జైపాల్ రెడ్డికే అప్పగించారు.
* 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి ఘనత సాధించారు.

 

 

 

 

 

tags : jaipal reddy, ex central minister, congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *