jaipal

జైపాల్‌….గర్వించదగ్గ మేధావి : సురవరం

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : మాజీ మంత్రి, దివంగత నేత జైపాల్‌రెడ్డి తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ మేధావి అని సీపీఐ కార్యవర్గ సభ్యుడు సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన నిబద్ధతతో వ్యవహరించారని కొనియాడారు. అవినీతికి ఆమడ దూరంలో ఉన్న నేతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ మైదానంలోని గాంధీ సెంటినరీ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన జైపాల్‌రెడ్డి సంతాప సభకు ఆయన హాజరయ్యారు.  ఆయన ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ… జైపాల్‌రెడ్డితో తనకు విద్యార్థి దశ నుంచి పరిచయముందన్నారు. ‘‘మేం ఇద్దరం మంచి స్నేహితులం. రాజకీయ ప్రత్యర్థులం. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో అనేక ప్రజా సమస్యలపై గళమెత్తారు. సోషలిస్టు భావాలను రాజకీయాల్లోకి జొప్పించారు. జైపాల్‌ మరణం దేశానికి తీరని లోటు’’ అని సురవరం అన్నారు. ఒక సభలో తనను పరిచయం చేస్తూ.. ‘లైఫ్‌ లాంగ్‌ ఫ్రెండ్‌.. పర్మినెంట్‌ పొలిటికల్ అపోనెంట్‌’ అని సంభోదించారని చెప్పారు. జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ ముద్దుబిడ్డ అని తెదేపా నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అన్ని అంశాలపై సమగ్ర సమాచారమున్న నడిచే గ్రంథాలయంగా జైపాల్‌ను అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ తదితరులు హాజరయ్యారు.

 

 

tags : jaipal, suravaram, vh

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *