హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. విలువల నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జైపాల్ రెడ్డి పార్థివ దేహానికి ఆయన పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జైపాల్‌ను కడసారి చూసేందుకు పలువురు ప్రముఖులు తరలిరావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక సీఎల్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్ జైపాల్ రెడ్డి పాడె మోశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన జైపాల్ రెడ్డి పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ఈ రోజు ప్రజల సందర్శనార్థం గాంధీభవన్‌కు తరలించారు. అక్కడి నుంచి అంతిమయాత్రగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్దకు తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, సిద్ధరామయ్య, రమేశ్ కుమార్, జానారెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వీహెచ్, గీతారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, పొన్నాల, శ్రీధర్‌బాబు, నంది ఎల్లయ్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, సంపత్‌కుమార్, సీతక్క, గూడూరు నారాయణ రెడ్డి, తెరాస ఎంపీ కేకే, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ నేతి విద్యాసాగర్, తెరాస నేతలు హరీశ్‌రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, డి.శ్రీనివాస్, భాజపా నేతలు చింతల రామచంద్రారెడ్డి, డీకే అరుణ, తెదేపా నేత నన్నపనేని రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు.
మన్మోహన్ సింగ్ సంతాప సందేశం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జైపాల్ రెడ్డి మృతికి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. సంతాప సందేశాన్ని జైపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీకి మన్మోహన్ పంపారు.
tags : jaipal reddy, funeral ceremony