జర్నలిస్ట్ రఘును విడుదల చేయాలి

రఘును విడుదల చేయాలి
ఐజేయూ,టీయూడబ్ల్యూజే

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్ట్ గంజి రఘును బేషరతుగా విడుదల చేసి, కేసులను ఉపసంహరించుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన నిలిచి, ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన పాపానికి జూన్ 3న, 9గంటల ప్రాంతంలో మల్కాజిగిరిలోని రఘు నివాసానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేని వాహనంలో చేరుకొని అదే సమయంలో కూరగాయల కోసం మార్కెట్ వెళ్లిన రఘును పట్టుకొని బలవంతంగా సదరు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారని వారు పేర్కొన్నారు. గుర్రంపోడు భూముల వ్యవహారంలో బాధితుల పక్షాన నిలిచి జర్నలిస్టుగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమే రఘు చేసిన నేరమనుకుంటే, రఘుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా పోలీసులు ప్రవర్తించడం సహించారనిదన్నారు. కిడ్నాప్ ముఠాలను మరపించే విధంగా రఘును నెంబరు ప్లేట్ లేని వాహనంలో మఫ్టీ పోలీసులు ఎత్తుకెళ్లడంలో అంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. గుర్రంపోడు భూముల విషయంలో రఘు పై మోపిన కేసులు పూర్తిగా అక్రమమైనవని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుపై తప్పుడు కేసులు పెట్టి కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా పట్టుకెళ్లడం అమానుష చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమంగా రఘును అరెస్ట్ చేసి మానవ హక్కులకు విఘాతం కల్పించారన్నారు. రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారం రాష్ట్రంలో జర్నలిస్టులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్ట్ రఘుకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇటీవలే మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *